ఆస్తిపన్ను గడువులోపు చెల్లించకుంటే భారమే | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను గడువులోపు చెల్లించకుంటే భారమే

Published Wed, Jun 28 2023 3:46 AM

వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం - Sakshi

వికారాబాద్‌ అర్బన్‌: మున్సిపాలిటీల్లో గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆలస్య రుసుం పేరుతో 2శాతం వడ్డీ వేసేందుకు మున్సిపల్‌ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 30లోపు సగం ఆస్తి పన్ను చెల్లించని వారికి ఈ వడ్డీ భారం తప్పదు. నిబంధనల ప్రకారం మున్సిపాల్టీలో భవన యజమానులు ప్రతి ఏటా రెండుసార్లు (ఆరు నెలలకు ఒక సారి) ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అర్ధ సంవత్సరానికి చెందిన ఆస్తి పన్నును జూన్‌ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే యజమానులు ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఫిబ్రవరి, మార్చిలోనే ఎక్కువగా పన్ను చెల్లిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఏటా వడ్డీ చెల్లించక తప్పడంలేదు. ఈ ఏడాది తప్పకుండా అర్ధవార్షిక పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్‌ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు.

యజమానులకు నోటీసులు
ఆస్తి పన్నును ముందస్తుగా వసూళ్లు చేసేందుకు మున్సిపల్‌ అధికారులు సంబంధిత యజమానులకు డిమాండ్‌ నోటీసులు పంపిస్తున్నారు. మున్సిపల్‌ బిల్‌ కలెక్టర్లను ఇంటింటికి ఒకటి రెండు సార్లు పంపి అర్ధ సంవత్సరం పన్ను చెల్లించాలని లేకుంటే అస్సలు పన్నుపై 2శాతం వడ్డీ పడుతుందని చెప్పిస్తున్నారు. అయితే ఆస్తిపన్ను చెల్లింపునకు అర్ధ వార్షిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తుంది. ఇప్పుడు చెల్లించకుంటే వచ్చేనెల నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. యజమానులు వెంటనే మున్సిపల్‌ బిల్‌ కలెక్టర్లకు లేక ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించుకోవడం మంచిదని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

ఐదుశాతం మినహాయింపు
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నెలలో ప్రారంభం కాగా ఆస్తపన్ను చెల్లింపుపై పురపాలక శాఖ ఐదు శాతం రాయితీ అవకాశాన్ని కల్పించింది. అంటే ఈ ఏడాదికి సంబంధించిన పన్నును ఒకేసారి చెల్లిస్తే మొత్తం పన్నులో ఈ ఐదు శాతం రాయితీ వర్థిస్తుంది. దీంతో కొంత మంది యజమానులు ఆసక్తి చూపి పన్ను చెల్లించడంతో మున్సిపాల్టీలకు కొంత నిధులు సమకూరాయి. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించినవారిని మినహాయిస్తే మిగిలిన వారంతా గడువులోగా పన్ను చెల్లింపకపోతే వడ్డీ భారం భరించాల్సిందే.

సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించడం కూడా భారమే. అందుకే అర్ధవార్షిక సంవత్సరంలో చెల్లిస్తే ఇంటి యజమానులకు భారం తగ్గుతుంది.

– శరత్‌ చంద్ర, వికారాబాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement