అందాల పోటీలను ఆపకుంటే ఉద్యమిస్తాం | Sakshi
Sakshi News home page

అందాల పోటీలను ఆపకుంటే ఉద్యమిస్తాం

Published Sat, Nov 4 2017 1:22 PM

stop Beauty Contest otherwise we protest - Sakshi

ఒంగోలు టౌన్‌: మహిళలను మనుషులుగా కాకుండా వారి అందచందాలపై వ్యాపారం చేసి సొమ్ము చేసుకోవాలనుకోవడం దుర్మార్గమైన చర్య..అని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. పద్మ ధ్వజమెత్తారు. విశాఖలో బ్యూటీ కంటెస్టు పేరుతో నిర్వహించనున్న అందాల పోటీలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల సాధికారిత గురించి, వారి అభివృద్ధి గురించి నిత్యం మాట్లాడే తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల వ్యాపార ప్రకటనల కోసం అందాల పోటీలను నిర్వహించడం వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనన్నారు. ప్రజా రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పదేళ్ల క్రితం ఒంగోలులో కూడా అందాల పోటీలను నిర్వహించతల పెడితే అన్ని సంఘాలు వ్యతిరేకించి ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు.

శ్రమలో, సంపద ఉత్పత్తిలో సగభాగంగా ఉన్న మహిళలు, వారి అస్తిత్వాన్ని గుర్తించకుండా సెక్స్‌ సింబల్‌గా చూసే ధోరణి మారాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం నాయకురాలు బడుగు ఇందిర మాట్లాడుతూ కారు షెడ్‌లో ఉంటేనే భద్రంగా ఉంటుందని, అదే మాదిరిగా మహిళలు వంటింట్లో ఉంటేనే రక్షణ ఉంటుందని మాట్లాడే నాయకులు ఉండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మహిళపై అత్యాచారం జరిగితే పట్టించుకోని నాయకులు, అందాల పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించి అలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.భారతి అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఓపీడీఆర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావలి సుధాకరరావు, పౌరసమాజం నాయకుడు జి.నరసింహారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణోదయ అంజయ్య, కోశాధికారి ఎన్‌.సామ్రాజ్యం, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.రాజశేఖర్, పీవైఎల్‌ రాష్ట్ర నాయకుడు ఎన్‌.నాగరాజు, ఏఐకేఎంఎస్‌ నాయకుడు కె. హనుమంతురావు, మహిళా నాయకులు సీహెచ్‌ పద్మ, సీతారావమ్మ, కాశమ్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement