
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర ఎన్‌సీపీ అభ్యరి్థగా గురువారం రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మంత్రి ఛగన్ భుజ్‌బల్, లోక్‌సభకు ఎన్నికైన సునీల్ తాట్కరే వెంటరాగా విధాన్ భవన్‌లో ఆమె నామినేషన్ సమరి్పంచారు. మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన నుంచి ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
దేశం దృష్టిని ఆకర్షించిన బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో సునేత్ర ఓటమి పాలైన విషయం తెలిసిందే. పీయూష్ గోయల్, ఉదయన్‌రాజే భోంస్లే (ఇద్దరూ బీజేపీ) ఇటీవలే లోక్‌సభకు ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అస్సాం, బిహార్‌లలో రెండేసి, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపురలలో ఒకటి చొప్పున రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. ఆయా చోట సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు.