లేఆఫ్స్‌తో టెకీల్లో గుబులు.. | Sakshi
Sakshi News home page

లేఆఫ్స్‌తో టెకీల్లో గుబులు..

Published Tue, Nov 26 2019 8:28 AM

IT Sector Employees Have Asked For Six Months Severance Instead Of Two - Sakshi

హైదరాబాద్‌ : ఉద్యోగం కోల్పోతాననే ఆందోళనతో హైదరాబాద్‌లో 24 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ హరిణి ఆత్మహత్య టెకీల్లో కలవరం రేపుతోంది. వేతన పెంపు, లేఆఫ్స్‌కు సంవత్సరాంతం అనువైన సమయం కావడంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే గుబులు ఐటీ ఉద్యోగులను వెంటాడుతోంది. ఆర్థిక మందగమనంతో ఉద్యోగుల తొలగింపుపై సర్వత్రా ఆందోళన నెలకొన్న క్రమంలో ఉద్యోగులకు బాసటగా తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ముందుకొచ్చింది. దాదాపు ప్రతి ప్రాజెక్టులో 18 శాతం ఉద్యోగులకు 4 రేటింగ్‌ ఇచ్చారని, అంటే వీరంతా 45 నుంచి 60 రోజుల్లో తమ సామర్ధ్యం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని, లేని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని అసోసియేషన్‌ సభ్యులు సందీప్‌ కుమార్‌ మక్తానా ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అసోసియేషన్‌తో పంచుకుని వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంస్థల్లో సభ్యత్వాలు తీసుకునేందుకు ఐటీ ఉద్యోగులను ఆయా కార్పొరేట్‌ సంస్థలు అనుమతించడం లేదు. యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కంపెనీలు అనుమతించవని, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తాము ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తోందని, ఏ ఒక్కరూ సాయం చేయరని ఓ ఉద్యోగి వాపోయారు. అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్‌ 13,000 మందిని సాగనంపుతూ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు దిగడం ఐటీ ఉద్యోగుల్లో అలజడి రేపుతోంది. వీరిలో అత్యధికులు మధ్యశ్రేణి, సీనియర్‌ పొజిషన్స్‌లో పనిచేస్తున్నవారే. ఇతర ఐటీ కంపెనీల్లోనూ ఇదే ట్రెండ్‌ నెలకొనడంతో అది ఉద్యోగుల శారీరక, మానిసిక, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఉద్యోగుల అభద్రతాభావం కుంగుబాటుకు చివరికి ఆత్మహత్యలకూ దారితీస్తోంది.

ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగంగా యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా వారి సామర్ధ్యం సరిగ్గాలేదని చూపే ప్రయత్నం చేస్తోందని ఐటీ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులను నిందించే బదులు నూతన ప్రాజెక్టులు లేదా క్లోజ్‌ చేసిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టిసారించాలని హితవు పలికింది. మరోవైపు ఉద్యోగులను తొలగించే క్రమంలో ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఆఫర్‌ చేస్తున్న రెండు నెలల పరిహార ప్యాకేజ్‌ను ఆరు నెలలకు పెంచాలని అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణలో ఐదు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరిలో అత్యధికంగా మధ్యశ్రేణి ఉద్యోగులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement