సముద్రుడి కోసం దర్భశయనం... | Sakshi
Sakshi News home page

సముద్రుడి కోసం దర్భశయనం...

Published Tue, Dec 22 2015 11:23 PM

సముద్రుడి కోసం  దర్భశయనం...

కన్యాకుమారి ప్రసిద్ధం. రామేశ్వరం జగత్ ప్రసిద్ధం. కానీ ఆ సమీపంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒకటి ఉంది. అదే దర్భశయనం.
రాముడు దర్భలమీద శయనించి, సముద్రుడిని ఉపాసించినట్టుగా చెబుతోంది ఇక్కడి స్థల పురాణం. పది అడుగుల రాముడి ఏకశిలా విగ్రహం గురించి, మరెన్నో విశేషాల గురించి వివరిస్తున్నారు దర్భశయనం సందర్శించిన ఒంగోలు వాస్తవ్యులు సంగుబొట్ల వెంకటసత్య భగవానులు.
 
‘పంచభూత లింగాల దర్శనంతో పాటు కన్యాకుమారి రామేశ్వరం ప్రాంతాలను సందర్శించాలనుకున్నాం మేము. కానీ అనుకోకుండా మరో పుణ్యక్షేత్రమైన దర్భశయన కూడా చూస్తామనుకోలేదు. అది మా యాత్రలో మాకు దక్కిన మరో భాగ్యం. ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకూ  దాదాపు 1000 కిలోమీటర్ల దూరం. రాను పోను మరో 1500 కిలోమీటర్ల ప్రయాణం పడుతుంది అనుకున్నాం. మా ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర అంతా కలిపి 7 రోజులు. ఇదంతా వెహికిల్ మాట్లాడుకుని తిరుగుదామని నిశ్చయించుకున్నాం. ఒంగోలు నుంచి బయల్దేరి ఈ యాత్రకు విఘ్నాలు కలగకుండా ముందుగా కాణిపాకంలోని గణపతిని దర్శించుకొని చిత్తూరు మీదుగా అరుణాచలం చేరుకున్నాం. అక్కడే ‘అగ్నిలింగం’ ఉంది. దానిని దర్శించుకొని రాత్రి శ్రీరంగపట్టణం మీదుగా మరుసటిరోజు అక్కడకు సమీపంలో ఉన్న జంబూకేశ్వరం చేరుకున్నాం. ఇక్కడే ‘జల లింగం’ ఉంది. దానిని దర్శించుకొని దిండిగల్ మీదుగా పళని- అటు నుంచి మధురై- దర్శించుకొని కన్యాకుమారి చేరుకున్నాం. మన ఉపఖండానికి చివర ప్రాంతం ఇది. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో శుచీంద్రంలోని అనసూయాదేవి ఆలయం ఉంది. అనసూయాదేవి అంటే సతీ అనసూయ. ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పసిపిల్లలను  చేసి, ఊయలలో ఊపిన స్థలం ఇదేనని అంటారు.

ఇక్కడి దేవాలయం పై కప్పు మీద శ్రీచక్రం ఉండటం అబ్బురంగా అనిపించింది. అలాగే ఇక్కడి 20 అడుగుల హనుమంతుని విగ్రహం చూడటానికి కూడా రెండు కళ్లు సరిపోలేదు. మరునాడు కన్యాకుమారి నుంచి రామేశ్వరం చేరుకొని ఆ చుట్టుపక్కల దేవాలయాలన్నీ దర్శించుకున్నాక తిరుగు ప్రయాణానికి సిద్ధమై దారిలో రామనాథపురం చేరుకున్నాం. తమిళనాడులో ఇదో పెద్ద జిల్లా. ఇక్కడే మాకు దర్భశయనం గురించి తెలిసింది. రామనాథపురం నుంచి  ఈ ఆలయం 10 కి.మీ. దూరంలో ఉందని స్థానికులు ఈ గ్రామాన్ని ‘తిరుపులని’ అంటారని చెప్పారు. ఈ వివరాలు విని దర్భశయనం చూడాలని నిశ్చయించుకున్నాం. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం 6.30 గంటలకు ఆలయానికి చేరుకున్నాం. కాని 8 గంటలకు గానీ దేవాలయ ద్వారాలు తెరుచుకోలేదు. సుమారు 10-15 ఎకరాలలో ఉంటుంది దర్భశయన దేవాలయం. సువిశాలంగా ఉన్న ఆ ఆలయ ప్రాకారాలు చూసుకుంటూ ముందుకు సాగాం. అది చాలా ప్రాచీన గుడి. మూలవిరాట్టును చూడగానే మాటల్లో చెప్పలేని ఉద్వేగానికి లోనయ్యాం. కథ తెలుసుకొని తరించాం.

పాయసం.. సంతాన భాగ్యం...
ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పాయసం పెడతారు. ఆ ప్రసాదాన్ని ఆకు దోనెలలో పెట్టి భక్తులకు పంచుతారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ప్రత్యేక పూజలు జరిపి ఈ పాయసం అందిస్తారు. ఈ పాయసం తింటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
 
కోనేరు తీర్థం పరమపవిత్రం
దర్భశయనంలో అతిపెద్ద కోనేరు ఉంది. అయితే ఇందులో స్నానాలు చేయకూడదు. తీర్థంగా ఇక్కడి నీళ్లు తెచ్చుకోవచ్చు. పరమపవిత్రమైన తీర్థంగా ఈ కోనేటికి పేరుంది.  
 
వసతి సదుపాయాలు
 ఇది చిన్న ఊరు. చిన్న చిన్న హోటళ్లలో భోజనం లభిస్తుంది. బస చేయడానికి మాత్రం 10 కి.మీ దూరంలో ఉన్న రామనాథపురానికి రావాలి. అక్కడ చాలా మంచి వసతి సదుపాయాలు ఉన్నాయి. దర్భశయనం ఊరు చిన్నదే అయినప్పటికీ దేవాలయం మాత్రం పెద్దది. రామనాథపురం నుంచి ఆటోలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.  దర్భశయనంలో ఫొటోలు తీసేవారున్నారు. కెమరా తీసుకెళితే మనమే ఫొటోలు తీసుకోవచ్చు. పెద్దగా నిబంధనలు ఏమీ లేవు.  పూజాద్రవ్యాలు అన్నీ లభిస్తాయి. వెంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.  దర్భశయనం పూజాసామగ్రిని అమర్చుకునే బుట్టల అల్లికకు చాలా ప్రసిద్ధి. అలాంటి ఆకర్షణీయమైన బుట్టలు మరేచోట కనిపించలేదు. రూ.40 నుంచి వంద రూపాయల దాకా వివిధ పరిమాణాల్లో ఈ బుట్టలు ఉన్నాయి.
 
ముఖ్య ఉత్సవాలు.
..
 మార్చి-ఏప్రిల్ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతుంది. శ్రీరామనవమి ఇక్కడ ముఖ్యమైన పండగ. అలాగే వైకుంఠ ఏకాదశి, జన్మాష్టమి, పొంగల్, దీపావళి, వారాంతాలు భక్తజన సందడి ఎక్కువగా ఉంటుంది.
 
దేవాలయ దర్శన వేళలు
ఉదయం 8 గంటల నుంచి 12.20 వరకు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8.00 వరకు.
 
తిరుగుప్రయాణం...
 దర్భశయనం దర్శించుకున్న తర్వాత నవగ్రహ పాషాణం చేరాం. రాములవారు రావణవధ తర్వాత తిరుగు ప్రయాణంలో నవగ్రహాలను ప్రతిష్టించి సీతాసమేతంగా పూజలు చేసి వెళ్లిన ప్రదేశం ఇది. అక్కడ భక్తులు నవగ్రహపాషాణాన్ని స్వయంగా తాకి, సముద్రంలో స్నానం చేసి వస్తారు. అక్కడ నుంచి తంజావూరులోని ప్రసిద్ధ బృహదీశ్వరాలయాన్ని సందర్శించుకొని రాత్రికి చిదంబరం చేరాం. ఇక్కడే పంచలింగాలలో ఒకటైన ‘ఆకాశలింగం’ ఉంది. దానిని దర్శించుకుని అక్కడ నుంచి కాంచీపురానికి చేరుకున్నాం. అక్కడ ‘పృథ్వీలింగం’ (ఏకాంబరేశ్వరస్వామిని) దర్శించుకున్నాం. అక్కడ నుంచి విష్ణుకంచిలోని వెండిబల్లి, స్వర్ణబల్లిని స్పర్శించి, అక్కడ నుంచి తిరుపతి మీదుగా శ్రీకాళహస్తి చేరాం. ఇక్కడ ‘వాయులింగం’ను దర్శించుకొని తిరిగి ఒంగోలుకు ఏడో రోజున చేరాం.

ఈ క్షేత్రాలలో అపురూపమైనదిగా రామేశ్వరంలో హనుమంతుడు లంఘించిన ప్రదేశం, గంధమాధన పర్వతం, రామేశ్వరానికి 10 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం-ధనుష్కోటి మధ్యలో సముద్రతీరంలో శ్రీరాముల వారు విభీషణుడు కలుసుకున్న ప్రదేశంలో ఓ గుడి ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ గుడిలో విభీషణుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ పూజలు చేయడానికి ఎవరూ లేరు. మనమే పూజలు చేసి, విభీషణుడిని దర్శించుకొని రావాలి. ఈ గుడికి చాలా తక్కువ మంది భక్తులు వెళ్లడం కనిపించింది. ఇక్కడ ప్రదేశాలన్నీ రామాయణం జరిగింది అనడానికి ప్రత్యక్షసాక్ష్యాలు. వాల్మీకి మహర్షి రామాయణంలో దర్భశయనం, నవగ్రహ పాషాణం ప్రస్తావన యుద్ధకాండలో వివరించి ఉన్నారు.
 
ఒక్కొక్కరికి 8 వేల రూపాయలు...

ఒంగోలు నుంచి (రాను పోను) లెక్కిస్తే 2600 కిలోమీటర్లు వచ్చింది. హైదరాబాద్ నుంచి అయితే మరొక 450 కిలోమీటర్లు కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం 3000 కిలోమీటర్లు అవుతుంది. వాహనం, భోజన వసతి, పూజాద్రవ్యాలు, పూజా కైంకర్యాలు.. ఇవన్నీ ఖర్చులు కలుపుకొని ఏడుగురికి 50 వేల రూపాయల ఖర్చు అయ్యింది.
 
 
స్థలపురాణం
శ్రీరామచంద్రుడు లంకకు వెళ్లడానికి వానర సేనతో సముద్రుడి మీద వారధి కట్టడానికి సిద్ధపడ్డాడు. సముద్రుడి కోసం ఇక్కడ రాముడు మూడు రోజుల పాటు దర్భల మీద శయనించి ఉపాసించాడు. అయినా సముద్రుడు రాలేదు. దీంతో సముద్రుడి మీద కోపగించిన రాముడు బాణ ప్రయోగానికి సంసిద్ధమయ్యాడు. దాంతో సముద్రం అల్లకల్లోలమైంది. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై శ్రీరాముడితో వారధి కట్టుకొమ్మని అందుకు తాను సాయం చేస్తానని చెప్పాడు. దీంతో నీలుడి ఆధ్వర్యంలో వానర సేనతో వారధి నిర్మించాడు రాముడు. ఇందుకు ఆనవాలుగా ఈ ఆలయం మూలవిరాట్టు దర్భల మీద శయనించి ఉంటుంది. అయితే వేల ఏళ్ల క్రితం పులవార్, కలవార్, కన్నవార్ అనే ముగ్గురు మహర్షులు మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేశారని, మహావిష్ణువు ప్రత్యక్షమై వారి కోరిక మీదకు అక్కడి దర్భల మీద శయనించాడనే పురాణగాథ కూడా ఉంది.  
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement