సింధూ, సాక్షికి ఢిల్లీ సీఎం సన్మానం | Sakshi
Sakshi News home page

సింధూ, సాక్షికి ఢిల్లీ సీఎం సన్మానం

Published Wed, Aug 31 2016 8:07 PM

Delhi CM felicitates Olympic medallists PV Sindhu, Sakshi Malik

న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో  భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఘనంగా సన్మానించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, రెజ్లర్ సాక్షి మాలిక్‌లకు ఆయన సన్మానించి, ఢిల్లీ ప్రభుత్వం తరఫున ప్రకటించిన చెక్కులను అందచేశారు. బ్యాండ్మింటన్‌లో గెలిచి రజతం సాధించిన పీవీ సింధుకు రూ.2 కోట్లు, రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్‌కు రూ.కోటి బహుమానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్  సింధూ, సాక్షి మాలిక్ అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కృషి, అంకితభావంతో వారు అనుకున్నది సాధించారని అన్నారు. అలాగే  సింధూ, సాక్షిమాలిక్ కోచ్లు గోపీచంద్, మణిదీప్ సింగ్లకు చెరో రూ. 5లక్షల చెక్లు  అందచేశారు.

ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్కు పీవీ సింధూ కృతజ్ఞతలు తెలిపింది. క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషకరంగా ఉందని... తమకు లభించిన గౌరవం మరవలేనిదని సింధూ అన్నారు. రియో ఒలింపిక్స్కు వెళ్లేటప్పుడు తమ వద్ద సెల్ఫోన్ కూడా లేదని, ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదన్నారు. అయితే పతకం సాధించి భారత్కు తిరిగి వచ్చాక.. తమ మ్యాచ్లను టీవీ సెట్ల వద్ద కూర్చుని చూశామని ప్రతి ఒక్కరూ చెబుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించిందని... తల్లిదండ్రులతో పాటు తమకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ సింధు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement