పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా

Published Tue, May 14 2024 3:29 AM

Huge Queues in Voters of Polling Stations: Andhra pradesh

ఉ.6 గంటల నుంచే భారీ క్యూలైన్లలో ఓటర్లు

ఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు, వృద్ధులు 

సా.6 తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్‌ 

గత ఎన్నికల కంటే ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అంచనా 

పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్‌ 

చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు 

హింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదు 

ఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్‌ కోరుతూ అభ్యర్థనలు రాలేదు 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా

 సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం పోటెత్తింది. ఉదయం ఆరు గంటల నుంచే వారు భారీ క్యూలైన్లలో వేచిఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పథకాల కొనసాగింపునకు మద్దతుగా మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు తప్ప రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఎక్కడా రీపోలింగ్‌ అవసరం ఏర్పడలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా సోమవారం సాయంత్రం ప్రకటించారు.

తొలిసారి ఓటర్లు, వృద్ధులు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారని, దీంతో గత ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. సా.6 గంటల దాటిన తర్వాత కూడా 3,500 పోలింగ్‌ స్టేషన్లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, రాత్రి 8.30 గంటలకు కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ముగిసిందని మీనా తెలిపారు. మరో 360 పోలింగ్‌ స్టేషన్లలో రాత్రి 10.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగిందన్నారు. దీంతో తుది పోలింగ్‌ శాతం మంగళవారం ప్రకటిస్తామని, సాయంత్రం ఐదు గంట­లకు 68.04 శాతం నమోదైందని మీనా తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, గాలివాన బీభత్సాలతో పోలింగ్‌ మందకొడిగా సాగిందన్నారు.

చెదురుమదురు సంఘటనలు
ఇక రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం గత కొన్ని నెలలుగా చేసిన కసరత్తు సత్ఫలితాలిచి్చందని మీనా చెప్పారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న భావనతో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశామని.. దీంతో సంఘటన జరిగిన వెంటనే స్పందించి వాటిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారన్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 ఈవీఎంలను ధ్వంసం చేయగా వాటిని భెల్‌ అధికారులు పరిశీలించి అందులోని డేటా సురక్షితంగా ఉందని నిర్థారించడంతో రీపోలింగ్‌ అవసరంలేకుండా కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ను కొనసాగించినట్లు తెలిపారు.

కౌంటింగ్‌ సమయంలో ఈ రెండు ఈవీఎంల డేటాను పరిగణనలోకి తీసుకుంటారని మీనా స్పష్టంచేశారు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 12 హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. తెనాలి, నరసరావుపేటల్లో ఎమ్మెల్యేలను.. అనంతపురంలో ఇరుపార్టీల అభ్యర్థులను గృహనిర్భందం చేయడం ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించినట్లు ఆయన తెలిపారు. ఇక పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్‌ విషయం దృష్టికి రాగానే పోలీసులు రంగం ప్రవేశంచేసి వారిని తీసుకొచ్చి పోలింగ్‌ కొనసాగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పోలింగ్‌ పరిశీలకులు,  రాజకీయ పార్టీలతో 17ఏ స్రూ్కటినీ పూర్తయిన తర్వాత రీ–పోలింగ్‌పై ఒక స్పష్టత వస్తుందని మీనా చెప్పారు. 

స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుకున్న ఈవీఎంలు
ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తియిన చోట్ల ఈవీఎం మిషన్లను పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చినట్లు మీనా తెలిపారు. కొన్నిచోట్ల 10.30 వరకు పోలింగ్‌ కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడ అర్థరాత్రి దాటిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుకుంటాయన్నారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చి ఆ తాళాలను సీఆర్‌పీఎఫ్‌ వారికి అందిస్తారన్నారు. 24 గంటలూ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఉంటాయని, రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అక్కడ 24 గంటలు కాపలాగా ఉండటానికి అనుమతిస్తామన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మీనా
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా సోమవారం ఉ.7.30కు తన ఓటు హక్కును విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని రైల్వే ఫంక్షన్‌ హాల్లో వినియోగించుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement