విజయ్ సేతుపతి సూపర్ యాక్టర్. హీరో అని మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అదరగొట్టేస్తుంటాడు. ఇతడు 50వ సినిమా 'మహారాజ'. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ చేస్తూ ఈ చిత్రంతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని సేతుపతి ధీమాగా చెబుతూ వచ్చాడు. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి సేతుపతి చెప్పినట్లు హిట్ కొట్టాడా? 'మహారాజ' ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. భార్య, కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్‌లో భార్య చనిపోతుంది. కూతురిపై ఇనుప చెత్త డబ్బా పడటంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తన కూతుర్ని కాపాడిన చెత్త డబ్బాకు లక్ష‍్మీ అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటారు. అయితే ఓ రోజు చెవిపై కట్టుతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహారాజ.. తన లక్ష‍్మీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు లక్ష‍్మీని పట్టుకుని మహారాజకు అప్పగించారా లేదా అనేదే స్టోరీ. (Maharaja Movie Review)
ఎలా ఉందంటే?
కొన్ని సినిమాల గురించి ఏ మాత్రం ఎక్కువ మాట్లాడుకున్నా ట్విస్టులు రివీల్ అయిపోతాయి. చూసేటప్పుడు ఫీల్ మిస్ అవుతుంది. 'మహారాజ' సరిగ్గా అలాంటి సినిమానే. రెండున్నర గంటల సినిమానే గానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సరదాగా మొదలైన మూవీ కాస్త మెల్లమెల్లగా సీరియస్ టోన్‌లోకి మారుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ వస్తుంది. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఊహకందని మలుపులు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.
హీరో భార్య, కూతురు ఓ ఇంట్లో కూర్చుని ఉండగా.. సడన్‌గా ఓ లారీ వచ్చి వాళ్లపైకి దూసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో హీరో భార్య చనిపోతుంది. ఓ చెత్త డబ్బా వల్ల కూతురు బతుకుంది. దీని తర్వాత వర్తమానంలోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఫస్టాప్ అంతా సరద సరదాగా వెళ్లిపోతూ ఉంటుంది. హీరో అసలు పోలీస్ స్టేషన్‌లో ఎందుకు అలా ఉండిపోయాడా? ఎందుకు అందరితో తన్నులు తింటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఎక్కడో ఓ మూల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అని డౌట్ వస్తుంది. కానీ మెల్లమెల్లగా స్టోరీలోకి వెళ్లేసరికి చూస్తున్న ఆడియెన్స్‌కి కిక్ వస్తుంది.
ఏదో సినిమా తీస్తున్నాం కదా అని అనవసరంగా పాటలు, కమర్షియల్ అంశాల పేరిట ఫైట్స్ పెట్టలేదు. ఏదో ఎంత కావాలో ఏ సీన్ ఎక్కడుండాలో ఫెర్ఫెక్ట్ కొలతలతో తీసిన మూవీ 'మహారాజ' అని చెప్పొచ్చు. అలానే చూస్తున్నప్పుడు ఎక్కడా సినిమా చూస్తున్నామని అనిపించదు. మన పక్కింట్లో వాళ్ల జీవితం చూస్తున్నం అనిపించేంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం.
ఎవరెలా చేశారు?
విజయ్ సేతుపతి పాత్రే డిఫరెంట్. దేనికి కూడా త్వరగా రియాక్ట్ అవడు. చాలా నెమ్మదిగా ఎమోషనల్‌గా బరస్ట్ అవుతాడు. చూడటానికి మామూలుగా కనిపిస్తాడు గానీ ఒక్కోసారి ప్రేక్షకుల మైండ్ పోయాలా ప్రవర్తిస్తాడు. దీన్ని సేతుపతి పిక్టర్ ఫెర్ఫెక్ట్‌గా చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశాడు. కృూరంగా కనిపిస్తూనే చివర్లో ఎమోషన్‌తో మనసు పిండేస్తాడు. మమతా మోహన్ దాస్, అభిరామి తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఒకటి రెండు సీన్స్‌లో కనిపించే భారతీ రాజా, ఎస్సైగా నటరాజన్ సుబ్రమణియం ఆకట్టుకున్నారు.
టెక్నికల్ విషయాలకొస్తే.. స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ అండ్ రామ్ మురళి అనే అతన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫెర్ఫెక్ట్ మూవీ అందించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ సీట్లలో కూర్చోబెట్టేశాడు. స్క్రీన్ ప్లేకి తగ్గట్లు ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే హింస, క్రైమ్ ఇందులో గట్టిగానే ఉంది. పాటలు, రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇందులో ఉండవు. సో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం 'మహారాజ' నచ్చేస్తుంది. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ మాత్రం అస్సలు రివీల్ చేయొద్దు. (Maharaja Movie Review In Telugu)
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment