జైహింద్‌ స్పెషల్‌: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు | Sakshi
Sakshi News home page

జైహింద్‌ స్పెషల్‌: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు

Published Wed, Aug 3 2022 1:44 PM

Azadi Ka Amrit Mahotsav: Wall Magazines In Freedom Struggle - Sakshi

స్వాతంత్య్రోద్యమంలో గోడ పత్రికలు ఉద్యమకారులకు ఏమాత్రం తక్కువకాని పాత్రను పోషించాయి. బ్రిటిషర్ల దురహంకారాన్ని వేలెత్తి చూపించాయి. గోడల వైపు తలెత్తి చూడటానికే బ్రిటిష్‌ అధికారులు సంశయించేంతగా మన తెలుగువాళ్లు గోడ పత్రికలపై నిజాలను నిర్భయంగా రాశారు. నాటి గోడపత్రికల ఆనవాళ్లు నేడు లేవు కానీ, ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తి నేటి అమృతోత్సవాలలో మహా నగరాల గోడలపై వర్ణ చిత్రాలుగా ప్రతిఫలిస్తూ ఉంది.
చదవండి: పెనంలోంచి  పొయ్యిలోకి పడిన రోజు!

యూరప్‌లో జరిగిన ఫ్యూడల్‌ వ్యతిరేకోద్యమంలో ఆయుధాలుగా ఆవిర్భవించిన పత్రికలు, ఆ సమాజాన్ని ఆధునీకరించడంలో అమోఘమైన పాత్రను నిర్వహించాయి. అలాగే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పత్రికలు అక్షరాయుధాలుగా కీలక భూమికను పోషించాయి. వాటిల్లో గోడ పత్రికలు, కరపత్రాలు కూడా ఉన్నాయి. 
అవి కూడా ఉద్యమజ్వాలల్ని రగిలించాయి.

తొలి గోడపత్రిక ‘నగరజ్యోతి’
దేశంలోనే తొలి గోడ పత్రికగా నెల్లూరులో ‘నగర జ్యోతి’ నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజలలో స్వాతంత్రేచ్ఛతోపాటు విజ్ఞానాన్ని వెలిగించింది. నెల్లూరులో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తూములూరి పద్మనాభయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక రహస్య సైక్లోస్టైల్‌ పత్రికను నడిపారు. అది బైటపడడంతో బ్రిటిష్‌ పోలీసులు ఆయనను ఆరెస్టు చేసి, జైల్లో పెట్టి హింసించారు. జైలు నుంచి విడుదలై  వచ్చాక 1932లో నెల్లూరు ట్రంకు రోడ్డులోని తిప్పరాజువారి సత్రం గోడలపై ‘నగరజ్యోతి’ని వెలిగించారు.

కాగితాలపై పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాసి సత్రం గోడలకు అంటించేవారు. ఆ కాగితాలను పశువులు తినేయడంతో, ఆ గోడలను బ్లాక్‌ బోర్డుగా చేసి చాక్‌పీసులతో వార్తలు రాయడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేవారు. స్వాతంత్య్రం రాకముందే తూములూరి పద్మనాభయ్య క్షయ వ్యాధితో మృతి చెందారు.

ఓకే పత్రిక... రెండు గోడలు!
పద్మనాభయ్యకు సహాయకులుగా పనిచేస్తున్న  ముత్తరాజు గోపాలరావు, ఇంద్రగంటి సుబ్రమణ్యం చెరొక గోడపై ‘నగరజ్యోతి’ కొనసాగించారు. వారిద్దరూ గాంధేయ వాదులు. ముత్తరాజు గోపాలరావు వార్తలలో ఆవేశం పాళ్లు ఎక్కువ. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు నాయకుడు కొండయ్యకు ఆశ్రయం కల్పించారని ముత్తరాజు గోపాలరావును పోలీసులు ఆరెస్టు చేసి జైల్లో పెట్టారు.

ఇంద్రగంటితో పోటీ పడలేక, ముత్తరాజు గోపాలరావు తన గోడను కూడా ఆయనకు అప్పగించేశారు. ఇంద్రగంటి తాను వాస్తవమని నమ్మినవే వార్తలుగా రాసేవారు. ఇటు విజయవాడ, అటు మద్రాసు నుంచి వచ్చే రైళ్ల కోసం అర్ధరాత్రి అయినా వేచి చూసి, వేరే వారి కోసం వచ్చిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ఫ్రీ ప్రెస్, పేట్రియాట్‌ వంటి పత్రికలను చూసి గబగబా వార్తలు రాసుకునే వారు. ఆ పత్రికలలో వచ్చిన కార్టూన్లను కూడా వేసేవారు.

బ్రిటిష్‌ వ్యతిరేక ప్రచారం
ఇంద్రగంటి సుబ్రమణ్యం ‘నగర జ్యోతి’ ద్వారా బ్రిటిష్‌ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక చివరి వరకు ఖద్దరునే ధరించారు. స్వాతంత్య్రమే తప్ప కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. వార్తలు రాయడానికి చాక్‌పీసుల కోసం తప్ప, తన కోసం ఏనాడూ చేయిచాచలేదు.

తాజా వార్తలను అందించడం తప్ప, ఇంద్రగంటికి వేరే వ్యాపకమే లేదు. నయాపైసా ఆదాయం లేకపోయినా, నాలుగు దశాబ్దాలపాటు ‘నగర జ్యోతి’ని ఆరిపోకుండా కాపాడారు. ఇంద్రగంటి 1976 సెప్టెంబర్‌ 16వ తేదీన తుదిశ్వాస విడిచేవరకు వార్తలను విడవలేదు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం రెండున్నర ఎకరాలను ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో శాలువాతో సరిపెట్టుకుంది.

విద్వాన్‌ విశ్వంకి జైలు!
కవి, రచయిత, పండిత పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విద్వాన్‌ విశ్వం బ్రిటిష్‌ పాలనలో ‘యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఫలితాలు’ అన్న కరపత్రం వేసినందుకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో ఎడిటర్‌గా 12 ఏళ్లు పనిచేశారు. మరెందరో చరిత్రకందని పాత్రికేయులు స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారు.
– రాఘవ శర్మ

Advertisement
 
Advertisement
 
Advertisement