ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న ఆఫ్ఘన్‌ బౌలర్లు | Afghanistan Bowlers At Peak In T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న ఆఫ్ఘన్‌ బౌలర్లు

Published Fri, Jun 14 2024 4:04 PM | Last Updated on Fri, Jun 14 2024 4:08 PM

Afghanistan Bowlers At Peak In T20 World Cup 2024

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్తాన్‌ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగిపోతుంది. మెగా టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో​ మూడింట విజయాలు సాధించి సూపర్‌-8కు అర్హత సాధించింది. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగంలో ఆఫ్ఘన్లకు తిరుగులేకుండా పోయింది. ఆ జట్టు బౌలర్లు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను 100 పరుగులలోపే ఆలౌట్‌ చేశారు. 

దీన్ని బట్టి చూస్తే బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో వారి ఆధిపత్యం ఎలా ఉందో ఇట్టే అర్దమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఉగాండను 58 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఆఫ్ఘన్‌ బౌలర్లు.. ఆతర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను 75 పరుగులకు.. తాజాగా పపువా న్యూ గినియాను 95 పరుగులకు కుప్పకూల్చారు. 

ఆఫ్ఘన్‌ బౌలర్లు ఈ తరహాలో చెలరేగడం వెనుక ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌తో ఆఫ్ఘన్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రావో ఆ జట్టు సాధిస్తున్న ప్రతి విజయంలో తనదైన మార్కును చూపాడు. బ్రావో ఆధ్వర్యంలో మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ ఫజల్‌ హక్‌ ఫారూఖీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫారూఖీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

ఉగాండతో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఫారూఖీ.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై 4 వికెట్లు..తాజాగా పపువా న్యూ గినియాపై 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఫారూఖీ రెండు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్ల వరుస విజయాల్లో ఫారూఖీ ప్రధానపాత్ర పోషించాడు. ఫారూఖీతో పాటు ఆఫ్ఘన్‌ బౌలర్లలో రషీద్ ఖాన్‌ (3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు)య సైతం ఓ మోస్తరుగా రాణిస్తున్నాడు.

ఈ టోర్నీలో ఆఫ్ఘన్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోతున్నారు. ఆ జట్టు బ్యాటర్లు రహ్మానుల్లా గుర్భాజ్‌ (167 పరుగులు), ఇబ్రహీం జద్రాన్‌ (114 పరుగులు) టోర్నీ లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఒకటి, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

గ్రూప్‌ దశలో మరో  మ్యాచ్‌ మిగిలుండగానే సూపర్‌-8కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్‌.. సూపర్‌-8లో భారత్‌ (జూన్‌ 20), ఆస్ట్రేలియా (జూన్‌ 22), బంగ్లాదేశ్‌/నెదర్లాండ్స్‌ (జూన్‌ 24) జట్లను ఢీకొంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement