‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ మూవీ రివ్యూ | Music Shop Murthy Movie Review And Rating In Telugu | Ajay Ghosh | Chandini Chowdary | Sakshi
Sakshi News home page

Music Shop Murthy Telugu Review: ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే?

Published Fri, Jun 14 2024 8:54 AM

Music Shop Murthy Movie Review And Rating In Telugu

టైటిల్‌: మ్యూజిక్‌ షాప్‌ మూర్తి
నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు
నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి
రచన & దర్శకత్వం: శివ పాలడుగు 
సంగీతం: పవన్ 
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ బెజుగం
ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి
విడుదల తేది: జూన్‌ 14, 2024

‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ కథేంటంటే.. 
పల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన మూర్తి(అజయ్‌ ఘోష్‌)..అదే గ్రామంలో మ్యూజిక్ షాప్ రన్ చేస్తుంటాడు. వయసు 52 యేళ్లు. మొదటి నుంచి మ్యూజిక్ షాప్ లోనే పని చేయడంతో...లాభాలు లేకున్నా...అదే పని చేస్తుంటాడు. భార్య జయ(ఆమని) ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముతూ..ఇద్దరి కూతుళ్ళని చదివిస్తుంది. మ్యూజిక్ షాప్ అమ్మి..మొబైల్ షాప్ పెట్టాలని జయ కోరిక.ఈ వయసులో కొత్త పని నేర్చుకునే కంటే...30 ఏళ్లుగా పని చేస్తున్న మ్యూజిక్ లోనే కొత్తగా ట్రై చేయాలని మూర్తి కోరిక. ఓ బర్త్‌డే పార్టీలో ఆయన పాటలు మిక్స్‌ చేసి ప్లే చేసిన విధానం అందరికి నచ్చి..డీజే అవ్వొచ్చు కదా అని సలహా ఇస్తారు. డీజే అయితే తనకు నచ్చిన పని చేస్తూనే బాగా డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చని..ఆన్‌లైన్‌లో డీజే కోర్స్‌ గురించి తెలుసుకుంటుంటాడు.

మరో వైపు అమెరికా నుంచి తిరిగి ఇండియా కి వచ్చిన  అంజన( చాందినీ చౌదరి) కి డీజే నే వృత్తిగా ఎంచుకోవాలనుకుంటుంది. అది ఆమె తండ్రి(భానుచందర్‌) కి నచ్చదు. తండ్రి అనుమతి తో డీజే అవ్వాలనుకుంటుంది. ఓ సందర్భంలో  మూర్తిని కలిసిన అంజనా....మ్యూజిక్ పై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి డీజే నేర్పించాలనుకుంటుంది. అంజనాని గురువుగా భావించిన మూర్తి..ఆమె చెప్పే పాఠాలు శ్రద్ధ గా విని డీజే వాయించడం పూర్తిగా నేర్చుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మూర్తి డీజే అవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకు? అంజన, మూర్తి మధ్య ఉన్న సంబంధాన్ని సమాజంతో పాటు కుటుంబ సభ్యులు ఎలా తప్పుపట్టారు? అంజనా తండ్రి ముర్తిపై ఎందుకు కేస్ పెట్టాడు? డీజే అవ్వడం కోసం హైదరాబాద్ కి వచ్చిన మూర్తికి ఎదురైన కష్టాలు ఏంటి? ఫేమస్ డీజే డెవిల్(అమిత్‌ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? చివరకు  52 ఏళ్ల మ్యూజిక్ షాప్ మూర్తి.. ఫేమస్ డీజే మూర్తిగా ఎలా మారాడు?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే


ఎలా ఉందంటే.. 
కొన్ని సినిమాల కథల్లో పెద్దగా ట్విస్టులు, టర్నింగ్‌ పాయింట్స్‌ ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా..తెరపై చూడాలనిపిస్తుంది. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ కథ కూడా అంతే. సినిమా స్టార్ట్‌ అయిన కాసేపటికే కాస్త ఆలోచిస్తే..ఇంటర్వెల్‌ సీన్‌ మొదలుకొని క్లైమాక్స్‌ వరకు ఈజీగా అంచనా వేయ్యొచ్చు. అయినా కూడా తెరపై చూడాలనిపిస్తుంది. అలా అని ఈ కథ కొత్తదేమి కాదు. చాలా రోటీన్‌, సింపుల్‌ కథే. హీరో ఒకటి సాధించాలనుకుంటాడు.. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే కష్టాలు..వాటిని అధిగమించి చివరకు విజయం సాధించడం.. ఇదే మ్యూజిక్‌ షాప్‌ మూర్తి కథ.

అయితే ఈ సినిమాలో హీరోకి 52 ఏళ్లు. ఆ వయసులో తన గోల్‌ని నెరవేర్చుకోవడమే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? అనేది చాలా ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు శివ పాలడుగు. కథనం రొటీన్‌గా సాగించినా.. ఎమోషన్‌ బాగా పండించి.. ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అయ్యేలా చేశాడు. 

ఈ కథకి హీరోగా అజయ్‌ ఘోష్‌ని ఎంచుకోవడమే దర్శకుడి మొదటి విజయం. ఓ యంగ్‌ హీరోని పెట్టి ఈ కథ చెబితే.. రొటీన్‌గా అనిపించేంది. కానీ వయసు మీద పడిన వ్యక్తి కథగా చెప్పడం కొత్తగా అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా వర్కౌట్‌ అయింది. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఓ పది నిమిషాల తర్వాత కథనం ఎలా సాగుతుందో అర్థమైపోతుంది. అయినా కూడా ఎక్కడా బోర్‌ కొట్టదు. అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి కలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. 

ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే నేర్చుకోవడం కోసం చేసే అతను సాధన చూపించారు. ఓ ఎమోషనల్‌ సీన్‌తో ఇంటర్వెల్‌ కార్డ్‌ పడుతుంది. ఇక సెకండాఫ్‌ మరింత ఎమోషనల్‌గా సాగుతూనే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. డీజే అవ్వడానికి మూర్తి పడే కష్టాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రీక్లైమాక్స్‌ కన్నిళ్లను తెప్పిస్తాయి. క్లైమాక్స్‌ బాగున్నా..ఎందుకో కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా మ్యూజిక్‌ షాప్‌ మూర్తి జర్నీ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తుంది. ‘మొదటి ప్రయత్నానికే విజయం సాధించాలి..అది అవ్వకపోతే వదిలేసి..వేరే పని చేసుకోవాలి’అని ఆలోచించే నేటితరం యువతకి మూర్తి కథ ఆదర్శం అవుతుంది.

ఎవరెలా చేశారంటే.. 
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరిని మెప్పిస్తున్న అజయ్‌ ఘోష్‌ ఇందులో లీడ్‌ రోల్‌ చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాభై ఏళ్లు పైబడిన మధ్యతరగతి వ్యక్తి మూర్తి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఒక్క పక్క నవ్విస్తూనే మరోపక్క ఏడిపించాడు. టైటిల్‌ సాంగ్‌కి స్టైప్పులేసి ఆకట్టుకున్నాడు. ఇక అంజనా పాత్రకి చాందిని చౌదరి న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించిన గురువు పాత్ర తనది. ఆమె పాత్ర చెప్పే కొన్ని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్య జయగా ఆమని చక్కగా నటించింది. అమిత్ శర్మ, భాను చందర్. దయానంద్ రెడ్డి, పటాస్ నానితో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. పవన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ పాయింట్‌.  సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- రేటింగ్‌: 2.75/5
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement