Centre Directs States To Complete E-KYC for PM Kisan - Sakshi
Sakshi News home page

E-KYC for PM Kisan: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం .. ఈ–కేవైసీ చేస్తేనే పీఎం కిసాన్‌

Published Sun, Dec 25 2022 4:30 AM

Central directed states to complete E-KYC for PM Kisan - Sakshi

సాక్షి, అమరావతి: ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్‌ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరులోపు రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని, లేకపోతే జనవరిలో విడుదల చేయనున్న 13వ విడత పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ–కేవైసీ ప్రక్రియ ఉద్దేశం రైతుల వాస్తవికతను ధ్రువీకరించుకోవడం కోసమేనని కేంద్రం వెల్లడించింది.  

నెలాఖరులోపు పూర్తిచేయాలి : సీఎస్‌  
అర్హులైన లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం ఆదేశాల మేరకు ఈ–కేవైసీ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు.

రాష్ట్రంలో క్రియాశీలక రైతులు 49,13,283 మంది ఉండగా, వారిలో ఈ నెల 21వ తేదీ వరకు 35,16,597 రైతులకు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, 13,96,686 మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లో ఉందని సీఎస్‌ చెప్పారు. వారికి ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

రైతులందరూ పీఎం కిసాన్‌ ప్రయోజనం పొందేలా వెంటనే ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలోపు 13వ విడత  పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement