జిల్లాకో మెడికల్‌ కాలేజీ | Medical Colleges in Telangana | Sakshi
Sakshi News home page

జిల్లాకో మెడికల్‌ కాలేజీ

Published Sun, Jun 2 2024 6:11 AM | Last Updated on Sun, Jun 2 2024 6:11 AM

Medical Colleges in Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో వచ్చిన మార్పు జిల్లాకో మెడికల్‌ కాలేజీ సాధనే అని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 700. ఉస్మానియా, గాం«దీ, వరంగల్‌ (కాకతీయ), ఆదిలాబాద్‌ (రిమ్స్‌) కాలేజీలు ఉండేవి. ఈ నేపథ్యంలో పేదలకు స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, డాక్టర్‌ కావాలనుకునే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది.

ఇందులో భాగంగా 2016లో 4 మెడికల్‌ కాలేజీలు సిద్దిపేట, మహబూబ్‌ నగర్, నల్లగొండ, సూర్యాపేటలో ప్రారంభించారు. దీంతో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 1640కి పెరిగింది. 2021లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలలో 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. నాటి సీఎం కేసీఆర్‌ వీటిని స్వయంగా ప్రారంభించి, ఒకేరోజు తరగతులు ప్రారంభించి రికార్డు సృష్టించారు.

దీంతో రాష్ట్రంలో మరో 1200 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయి. 2022లో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌ల్లో మరో 9 మెడికల్‌ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల సంఖ్య 26కు పెరిగింది. చివరి దశగా గతేడాది మరో 8 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా... ఈ ఏడాది ఎన్‌ఎంసీ తనిఖీ ప్రక్రియ జరుగుతోంది. వీటికి కూడా అనుమతులు వస్తే జిల్లాకో మెడికల్‌ కాలేజీ పూర్తి కానున్నది. ఇక వీటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

గుండెపోట్ల చికిత్సకు ‘స్టెమీ’
గుండెపోట్లను వెంటనే గుర్తించి చికిత్స అందించేందుకు స్టెమీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉస్మానియా, గాం«దీ, వరంగల్‌ ఎంజీఎం, రిమ్స్‌ ఆదిలాబాద్, ఖమ్మంలో క్యాథ్‌­ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.

టీ డయాగ్నొస్టిక్స్‌  
వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు టీ డయాగ్నొస్టిక్స్‌ను ప్రారంభించింది. ఇందులో 135 రకాల రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు. ఆటో అనలైజర్‌లు, డిజిటల్‌ ఎక్స్‌–రేలు, ఆ్రల్టాసౌండ్‌ స్కాన్‌ మెషీన్‌లు, 2–డి ఎకో, మామ్రోగామ్, హై ఎండ్‌ డయాగ్నొస్టిక్‌ పరికరాలు ఈ హబ్‌లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పీహెచ్‌సీలు మొదలు అన్ని స్థాయిల దవాఖానాలను టీ డయాగ్నొస్టిక్స్‌కు అనుసంధానం చేసింది. దీంతో పేదలు అటు చికిత్సకు, ఇటు వ్యాధి నిర్ధారణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.  

గర్భిణులకు చేయూత... 
2017లో ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌తో బహుళ ప్రయోజనాలు కనిపించాయి. ప్రభుత్వ దవాఖానాల్లో పరీక్షలు, ప్రసవం చేయించుకునే మహిళలకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేలు, ఆడపిల్లల జన్మిస్తే మరో రూ.వెయ్యి అదనంగా నగదును అందించింది. అదనంగా తల్లీబిడ్డకు అవసరమయ్యే వస్తువులతో కూడిన రూ. 2 వేల కిట్‌ను అందించింది. గతేడాది చివరినాటికి దాదాపు 14 లక్షల మంది ఈ పథకంతో లబ్ధి పొందారు. అలాగే గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు న్యూ్రటిషన్‌ కిట్ల పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది.  

కొత్తగా స్పెషాలిటీ సేవలు  
గత ప్రభుత్వం ఏరియా, జిల్లా, సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలను బలోపేతం చేసింది. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ జిల్లా దవాఖాన మంజూరైంది. దీంతో ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని 27,500 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించే కార్యక్రమం గతేడాది పూర్తయింది. సూపర్‌ స్పెషాలిటీ వసతుల మెరుగు కోసం హైదరాబాద్‌ నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌) పేరుతో 26 ఏప్రిల్‌ 2022న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో టిమ్స్‌ నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు.

ఇవి ఎయిమ్స్‌ మాదిరి స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థలుగా సేవలందించనున్నాయి. అల్వాల్‌లో 28.41 ఎకరాల్లో రూ.897 కోట్ల ఖర్చుతో, గడ్డి అన్నారంలో 21.36 ఎకరాల్లో రూ.900 కోట్ల ఖర్చుతో, ఎర్రగడ్డలో రూ.882 కోట్ల ఖర్చుతో పనులు ప్రారంభం అయ్యాయి. అదనంగా నిమ్స్‌లో 2000 సూపర్‌ స్పెషాలిటీ పడకల పనులు ప్రారంభం అయ్యాయి. వరంగల్‌లో 24 అంతస్తులతో హెల్త్‌ సిటీ నిర్మాణం తుది దశలో ఉంది. రూ.1200 కోట్ల వ్యయంతో 2021 జూన్‌లో 59 ఎకరాల్లో పనులు మొదలయ్యాయి. ఇక్కడ 34 విభాగాల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తారు. ఇవన్నీ పూర్తయితే 8,200 సూపర్‌ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement