మందులకు భారీగా వ్యయం  | Sakshi
Sakshi News home page

మందులకు భారీగా వ్యయం 

Published Sun, Sep 24 2023 4:48 AM

Medicines with WHO standards in government hospitals - Sakshi

సాక్షి,అమరావతి: వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోగులకు సరఫరా చేసే మందుల విషయంలోనూ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మందుల సరఫరాకే ఏకంగా రూ.2,230 కోట్లను ఖర్చుచేసింది.

గ్రామాల్లోని డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ (జీఎంపీ) ప్రమాణాలుగల మందులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తీవ్ర కటకట ఉండేది. ఆ పరిస్థితులకు చెక్‌ పెడుతూ సరఫరా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు, మందుల బడ్జెట్‌ కేటాయింపులను ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. దీంతో ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి.   

రూ.200 కోట్ల నుంచి రూ.500కోట్లకు పెంపు.. 
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా కోసం ఏటా సుమారు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసేవారు. ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి సరిపడా మందుల బడ్జెట్‌ ఉండేది కాదు. కేవలం 229 రకాల మందులను మాత్రమే అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో ఆస్పత్రుల్లో మందులకు తీవ్ర దుర్భర పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది.

ఈ క్రమంలో.. ఆస్పత్రుల్లో మందుల కోసం బడ్జెట్‌ను పెంచింది. ఏటా రూ.500 కోట్ల మేర బడ్జెట్‌ను కేవలం మందుల సరఫరాకే వె చ్చిస్తోంది. అంతేకాక.. మందుల సంఖ్యను 608కు పెంచింది. ఇలా 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం మందుల సరఫరాకే రూ.2,230 కోట్ల మేర ఖర్చుచేశారు. దీన్నిబట్టి పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపునకు పైగా ఈ ప్రభుత్వం మందుల కోసం ఖర్చుచేసినట్లు స్పష్టమవుతోంది.

విలేజ్‌ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 172, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన పెద్ద ఆస్పత్రులకు అక్కడి అవసరాలకు అనుగుణంగా నిరంతరం సరఫరా చేస్తున్నారు.  

గ్రామ స్థాయిలోనే 105 రకాల మందులు.. 
ఇక గ్రామస్థాయిలోనే 105 రకాల మందులను విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేకూరుస్తోంది. గత టీడీపీ హయాంలో జ్వరం, దగ్గు, తలనొప్పి వస్తే డోలో, పారాసెటిమాల్‌ కూడా లభించని దుస్థితి గ్రామాల్లో ఉండేది. ఈ పరిస్థితులకు చెక్‌పెడుతూ ఏకంగా గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ రూపంలో మినీసైజ్‌ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు.

వీటిలో 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, ఏకంగా 105 రకాల మందులు ఉంటున్నాయి. దీంతో థైరాయిడ్, యాంటి థైరాయిడ్, రక్తంలో కొలె్రస్టాల్‌ సాంద్రతను తగ్గించే మెడిసిన్, హృదయనాళ సంబంధిత సమస్యలకు వాడే మందులు, యాంటి టీబీ మెడిసిన్, యాంటి లెప్రసీ మెడిసిన్, యాంటి ఎపిలెప్సీ మెడిసిన్, ఇతర ఔషధాలు గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి.

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్యులు వెళ్తున్నారు. మరోవైపు.. టెలీ మెడిసిన్‌ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్‌ ఫిజీషియన్‌ కన్సల్టేషన్లు ఇక్కడే లభిస్తున్నాయి. ఈ వైద్యుల ప్రి్రస్కిప్షన్‌ మేరకు విలేజ్‌ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు ఉచితంగా ప్రజలకు మందులు అందిస్తున్నారు. 

Advertisement
Advertisement