అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినిపించిన పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్‌పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్ ది ఎస్‌డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.
పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..
ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్‌పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.
అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.
‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే..
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment