
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ బడ్జెట్(Legislative Assembly budget) సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోజు వీలుకాని పక్షంలో వచ్చే నెల 3వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వీటి ప్రారంభానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సోమవారం ఢిల్లీ వెళ్లారు. శిక్షణా తరగతులకు వచ్చేందుకు ఓం బిర్లా అంగీకరించినట్లు వారు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించినట్లు చెప్పారు.