సీఎం జగన్ రాకతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కొత్త శోభ
ఉమ్మడి జిల్లాలో సంబరంలా 16వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర
భారీ ఎత్తున పోటెత్తిన జనసంద్రం
అడుగడుగునా ఎదురొచ్చి దిష్టితీసి, హారతులు పట్టిన అక్కచెల్లెమ్మలు
అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులను
బస్సుదిగి పలకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్త పండుగ శోభను సంతరించుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయనను చూడటానికి జనసంద్రం పోటెత్తింది. ఊరూవాడా వెల్లువలా ప్రజలు తరలివచ్చారు. అక్కచెల్లెమ్మలు దిష్టితీసి హారతులు పట్టారు. హత్యాయత్నం నుంచి బయటపడి తమ వద్దకు వచ్చిన సీఎం జగన్‌ను చూడటానికి అభిమాన సంద్రం ప్రవాహంలా పోటెత్తింది.
తనను చూడటానికి వచ్చిన అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చిన్నారులను బస్సు దిగి సీఎం ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఓవైపు మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావంటూ అవ్వాతాతల ఆశీర్వచనాలు, మరోవైపు మా ఓట్లు మీకే అంటూ అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఇంకోవైపు మేమున్నామన్నా అంటూ యువకుల ఉత్సాహం మధ్య బస్సు యాత్ర ఆద్యంతం సంబరంలా సాగింది.
జననేతకు జన నీరాజనం
సోమవారం గుడివాడ బహిరంగ సభ ముగించుకుని ఏలూరు జిల్లా నారాయణపురం చేరుకుని రాత్రి బస చేసిన సీఎం వైఎస్ జగన్‌ను మంగళవారం ఉదయం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. వారి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నారాయణపురం శివారు ప్రాంతానికి చెందిన ఉండ్రాజవరపు భుజంగరావు, గీతారాణి దంపతులు సీఎం బస్సు వద్దకు వచ్చారు.
తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని సీఎం జగన్‌ను కోరగా ఆయన వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చి బాలుడితో అక్షరాలు దిద్దించారు. తమ అభిమాన నేతతో తమ బిడ్డకు అక్షరాభ్యాసం చేయించడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది ఎన్నటికీ మరువలేమని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తనపై అభిమానంతో ఓ చెల్లెమ్మ వేసిన పెన్సిల్ స్కెచ్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సుయాత్ర నారాయణపురం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. రాచూరు చేరుకున్న సీఎం జగన్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు.
అవ్వాతాతలు, అన్నా ఎలా ఉన్నావంటూ అక్కచెల్లెమ్మలు సీఎం వైఎస్ జగన్‌ను ఆప్యాయంగా పలకరించారు. ‘మీరంతా నాకు అండగా ఉండగా నాకేం కాదమ్మా’ అంటూ వారికి ధైర్యం చెప్పి ఆయన ముందుకు కదిలారు. తర్వాత సీతారామపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు జేజేలు పలికారు. అక్కచెల్లెమ్మలు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులు పట్టారు. దారిపొడవునా మేమంతా సిద్దమంటూ బారులు తీరి ప్రజలు స్వాగతం చెప్పారు. తర్వాత సీఎం జగన్ గాం«దీనగర్ మీదుగా నిడమర్రు చేరుకున్నారు. అక్కడ అడుగడుగునా అక్కచెల్లెమ్మలు నీరాజనాలు పలికారు.
తన కోసం వేచి చూస్తున్నవారిని పలకరిస్తూ సీఎం ముందుకు సాగారు. భువనపల్లి మీదుగా సాగిన సీఎం జగన్ బస్సుయాత్రకు గణపవరంలో జనం పోటెత్తారు. స్థానికులు అఖండ స్వాగతం పలికారు. గణపవరం సెంటర్‌లో తన కోసం ఎదురుచూస్తున్న అశేష జనవాహినికి ముఖ్యమంత్రి జగన్ బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు. ఓవైపు ఎండ మండుతున్నా ప్రజలెవరూ లెక్క చేయలేదు. ప్రవాహంలా కదిలిన జనం బస్సుయాత్రను అనుసరించారు. పాములపర్రు, ఆరేడుల్లో సీఎంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడి నుంచి ఉండి చేరుకునేసరికి భారీ ఎత్తున ప్రజలు, పార్టీ నేతలు ఎదురొచ్చి జన నేతకు ఘనస్వాగతం పలికారు.
చిమ్మచీకట్లోనూ అభిమాన వెలుగు
చీకటి పడినప్పటికీ సీఎం జగన్‌పై ప్రజాభిమానం ఏమాత్రం సడలలేదు. భీమవరం నుంచి గొల్లలకోడేరు వచ్చే వరకూ ప్రజలు జగన్ రాక కోసం వేచి చూశారు. వారి వద్దకు చేరుకున్న జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి గరగపర్రు, యండగండి, సాగుపాడు, కేశవరం, అప్పన్నపేట మీదుగా పిప్పర చేరుకున్న జననేత బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. బాణసంచా వెలుగులు, డప్పు వాయిద్యాలతో పిప్పర గ్రామమంతా తరలివచ్చి జగన్‌కు జై కొట్టింది.
అగ్రహారం, చిలకంపాడు, ముదునూరు, కాశిపాడు దాటి చింతపల్లి నుంచి రావిపాడు చేరుకుంది. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా తణుకు మండలంలోని దువ్వ గ్రామానికి చేరుకున్న జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పొద్దుపోయినా తమ అభిమాన నాయకుడి కోసం పల్లెలు ఎదురుచూశాయి. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ రాత్రి 10.09 గంటలకు తేతలి శివారులోని రాత్రి బస ప్రాంతానికి జగన్ చేరుకున్నారు. అక్కడికి సైతం వచ్చిన అభిమానులు జగన్‌ను చూసి జగనన్నా మళ్లీ నువ్వే సీఎం అంటూ నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ 16వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రను సీఎం జగన్ ముగించారు.
భీమవరం జనసంద్రం
ఉండి నుంచి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద బహిరంగ సభకు సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రోడ్ షో ద్వారా చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ జరగాల్సి ఉండగా జనాభిమానం వెల్లువెత్తడంతో గంటన్నర ఆలస్యమైంది. అప్పటికే భీమవరం జనసంద్రమైంది. రోడ్లన్నీ జనజాతరను తలపించాయి. డప్పులు, డీజేలు మోగిస్తూ అభిమానులు వీధుల్లో ఆనందతాండవం చేశారు. సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ర్యాంప్‌పై నడుస్తూ జనసంద్రానికి సీఎం జగన్ అభివాదం చేశారు.
అనంతరం సభలో ప్రసంగిస్తూ ‘ఈ మధ్య కోపం ఎక్కువై చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు.. నాకేదో అయిపోవాలని కోరుకుంటున్నారు’ అని మండిపడ్డారు. ‘అలాగే భార్యల్ని మార్చినట్టు నియోజకవర్గాలను మార్చేస్తున్న దత్తపుత్రుడికి బీపీ పెరిగిపోతోంది’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. దీంతో సభలో ఉన్నవారి నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సాయంత్రం 6.23 గంటలకు సభ ముగియగానే సీఎం వైఎస్ జగన్ భీమవరం మీదుగా తిరిగి రోడ్ షో కొనసాగించారు.
చీకటి పడినప్పటికీ గొల్లలకోడేరులో ప్రజలు తమ అభిమాన నేత రాకకోసం వేచి చూశారు. వారి వద్దకు చేరుకున్న సీఎం జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జన ప్రవాహం భారీగా రావడం వల్ల యాత్ర ఆలస్యమవుతుండటంతో బస ప్రదేశాన్ని అప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. ముందుగా నిర్ణయించిన తూర్పుగోదావరి జిల్లా ఈతకోట నుంచి తణుకు వద్ద తేతలి గ్రామ శివారులో జాతీయ రహదారిని ఆనుకుని బసను ఏర్పాటు చేశారు.
తరలివచ్చిన ఊళ్లకు ఊళ్లు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూడటానికి.. యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఊళ్లకు ఊళ్లే తరలివచ్చాయి. అన్నా..మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధమంటూ యువత నినదించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా స్థానిక నేతలు ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలు వేశారు. అలాగే అడుగడుగునా అన్నదానాలు, మజ్జిగ పంపిణీ చేపట్టారు.
జనసంద్రం తరలిరావడంతో బస్సుయాత్ర నిదానంగా ముందుకు సాగింది. అందరినీ పలకరిస్తూ షెడ్యూల్ కంటే ఆలస్యంగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగింది. దీంతో ఉండి శివారులో మ.3.53 గంటలకు మధ్యాహ్న విరామ ప్రాంతానికి సీఎం జగన్ వెళ్లారు. ఉండి నియోజకవర్గం కోలమూరు గ్రామంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా నాలుగు నెలల బాలింత చంటి బిడ్డతో సీఎం జగన్‌ను చూడాలని వేచి చూసింది.
గుర్తు పట్టి.. బస్సు ఎక్కించుకుని..
ద్వారకా తిరుమల: రహదారి పక్కన నిలబడి సీఎం వైఎస్ జగన్‌కు అభివాదం చేస్తున్న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. జనసంద్రంలో రాజబాబును చూసి గుర్తు పట్టిన సీఎం వైఎస్ జగన్ బస్సు ఆపించి మరీ అందులో ఆయనను ఎక్కించుకుని తన వెంట తీసుకెళ్లడం పార్టీ శ్రేణులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నారాయణపురం నుంచి భీమవరానికి వెళుతున్న సీఎం వైఎస్ జగన్‌కు నిడమర్రు వద్ద రాజబాబు అభివాదం చేశారు. ప్రజల్లో ఉన్న రాజబాబును గుర్తు పట్టిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించి, అందులో ఆయనను ఎక్కించుకున్నారు. ఉండి వరకు సీఎంతోపాటు బస్సులో వెళ్లానని.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను ఆయనకు వివరించానని రాజబాబు తెలిపారు.
ఎంతో మంది నాయకుల మధ్యలో ఉన్నా తనను జగనన్న గుర్తుపట్టి, ఉన్నఫళంగా రోడ్డుపై బస్సు ఆపి, ఎక్కించుకుని తీసుకెళ్లడం ఒకింత తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడే ఏ ఒక్కరినీ జగనన్న మరచిపోరని చెప్పడానికి తనకు ఎదురైన అనుభవమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆ దుర్మార్గులకు మనసనేది ఉందా?
సీఎం వైఎస్ జగన్ నుదుటన గాయాన్ని చూసి చలించిపోయిన ప్రజలు
బస్సు యాత్రలో దారిపొడవునా ఆప్యాయతానురాగాలు
సాక్షి, భీమవరం: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూడటానికి ఊరూవాడా తరలివచ్చింది. ఈ సందర్భంగా ఆయన నుదుటన గాయాన్ని చూసినవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్న మనిషిని మట్టుబెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో ఆ దుర్మార్గులకంటూ మండిపడ్డారు. దెబ్బ తగిలినప్పుడు బాధతో ఎంత విలవిలలాడాడో బిడ్డ అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గాయం త్వరగా నయం కావాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం జాగ్రత్త బాబు అంటూ అవ్వాతాతలు సీఎం జగన్‌పై ఆప్యాయత చూపారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో దారిపొడవునా ఇవే దృశ్యాలు కనిపించాయి.
ఆయనకు ఏమన్నా అయితే మేమేమైపోవాలి..
సీఎం వైఎస్ జగన్ వల్ల మేం చాలా లబ్ధిపొందాం. ఆయన చేసిన సహాయానికి మేము రుణం తీర్చుకుంటాం. ఆయన మాలాంటి పేదలకు చేస్తున్న సేవల్ని అడ్డుకునేందుకు కుట్రపన్ని హత్యాయత్నం చేశారు. ఆయనకు ఏమైనా అయితే మేమేమైపోవాలి? – ఎం.పావని, గణపవరం
ఎంత విలవిలలాడిపోయారో?
జగన్ సర్ నుదుటన దెబ్బ చూడలేకపోయాం. ఆ దెబ్బ తగలినప్పుడు ఆయన ఎంత విలవిల్లాడిపోయారో. పేదలకు మంచి చేస్తున్న ఆయనపై హత్యాయత్నం చేయడానికి దుర్మార్గులకు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులు జగన్ సర్‌పై నిండా ఉన్నాయి. ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పేదలకు మంచి చేస్తున్న ఆయనకు అంతా మంచే జరుగుతుంది. – కొణిదెల అలంకారం, మందలపర్రు
చాలా బాధనిపించింది..
పేదల కోసం పాటుపడుతున్న సీఎం జగన్‌పై హత్యాయత్నం చేయడం దారుణం. నాకు చాలా బాధనిపించింది. గాయంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఆయనను చూడాలన్న ఆశతో చుట్టుపక్కల వారి సాయంతో వచ్చాను. సొంత సోదరుడి మాదిరి ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌పై దుర్మార్గులు దాడి చేయడం చాలా నీచమైన పని. – పత్తివాడ జయలక్ష్మి, నిడమర్రు
ముఖంపై దెబ్బ చూసి తల్లడిల్లిపోయా..
జగన్ బాబు ముఖంపై దెబ్బ చూసి తల్లడిల్లిపోయాను. అంత దెబ్బ ఎలా తట్టుకున్నాడో. జగన్ బాబుకు మంచి జరగాలని దేవుడికి తైలాభిషేకం చేయించాను.
ఆయనపై హత్యాయత్నం చేసినవారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. – కర్తాకి రాజ్యం, క్రొవ్విడి
Comments
Please login to add a commentAdd a comment