సర్వేలపై ఎల్లో మీడియా సొంత కథనాలు | Sakshi
Sakshi News home page

సర్వేలపై ఎల్లో మీడియా సొంత కథనాలు

Published Sun, Aug 27 2023 4:31 AM

MP Vijayasai Reddy Fires on Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్‌ అంటూ ఎల్లో మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియా టుడే ఇంగ్లిష్‌ న్యూస్‌ చానల్‌... సీ ఓటర్‌తో కలిసి చేసిన సర్వే మాత్రమే అసలు సిసలు అంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోందన్నారు.

పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితే ఒరిజినల్, లేకపోతే ఆ సర్వే ఫేకా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తామనే ధీమా టీడీపీలో ఏ ఒక్కరికీ లేదన్నారు. రాజకీయాల్లో విజేతలు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. పరాజితులు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు జారీ చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని చెప్పారు. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దాన్ని చంద్రబాబు తనకు ఆపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్ఫూర్తి అని అన్నా అంటారన్నారు. ‘‘నా హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కొత్త పుంతలు తొక్కింది.. ఎందరో పుష్పరాజ్‌లను నేను తయారు చేశా.. పుష్ప పార్ట్‌ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ’’ అని బాబు అంటారేమో అని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాము సమీక్ష నిర్వహిస్తే ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు.

జర్నలిజం విలువలను పూర్తిగా వదిలేసిన ఈనాడు అభూత కల్పనలు రాస్తూ నానాటికీ దిగజారుతోందన్నారు. కాగా ఇంటర్నేషనల్‌ కాంపిటెన్స్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ ప్రకటించిన జైవిక్‌ ఇండియా అవార్డుకు ఎంపికైన గనిమిశెట్టి పద్మజకు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. మన రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కడం ప్రశంసనీయమన్నారు. 
 

Advertisement
Advertisement