ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా  | Sakshi
Sakshi News home page

ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా 

Published Wed, Apr 17 2024 5:10 AM

YS Avinash Reddy comments over cbi and sunitha - Sakshi

హియర్‌ సే ఎవిడెన్స్‌ ఆధారమంటూ కట్టుకథ అల్లారు

గూగుల్‌ టేకౌట్‌కు ఎలాంటి శాస్త్రీయతా లేదు 

చేయని నేరానికి నా తండ్రి ఏడాదిగా జైలులో మగ్గుతున్నారు 

వివేకా చనిపోయేంత వరకు నాకోసం పనిచేశారు 

సునీత కూడా మొదట్లో ఈ విషయాన్ని చెప్పింది 

అలాంటపుడు ఎంపీ టికెట్‌ మోటివ్‌ అని ఎలా చెబుతారు? 

సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు : కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నది లేన­ట్లు, లేనిది ఉన్నట్లు సునీతక్క చెబుతోందని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా, పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్‌ సే ఎవిడెన్స్‌ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్‌ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.

‘వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. కానీ, సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. పైగా, అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్‌ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్‌ వ్యవ­హారాన్ని తీసుకొచ్చారు.

ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్‌ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్‌ రాదు. కాబట్టే బెయిల్‌ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. ఇక అతను జైలుకెళ్లే అవకాశం లేదు. సీబీఐ, సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకుడినని ఒప్పుకొన్న అతన్ని అరెస్టు చేసి ఉంటే జీవిత కాలం బెయిల్‌ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్‌ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు.

ఇక జీవిత కాలం ఈ కేసులో అతని అరెస్టు ఉండదని హామీ ఇచ్చి, ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా?’ అని అవినాశ్‌ ప్రశ్నించారు. దస్తగిరి హియర్‌ సే ఎవిడెన్స్‌ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, రెండున్నరేళ్లు శివశంకర్‌రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు.

గూగుల్‌ టేకౌట్‌కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్‌ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని తెలిపారు.  

సునీత అప్పుడొకలా.. ఇప్పుడొకలా..  
వివేకా హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాశ్‌ అన్నారు. ‘2020 జూలై 20న సీబీఐకి సునీత వాంగ్మూలమిస్తూ ఆమె భర్త సెల్‌ఫోన్‌లో వివేకా రాసిన డెత్‌ నోట్‌ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్‌ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడని,  ఈ లెటర్‌ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని రాసి ఉన్నట్లు చెప్పింది.

2020 ఆగస్టు 27న లెటర్‌ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చూపించారని చెబుతోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాశ్‌ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు ఏమేమి చేయాల్నో అంతా చేశారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్‌ మోటివ్‌ అని చెబుతున్నారు.

నాలుగేళ్ల తర్వాత 2023 మే31న సీబీఐ దగ్గరికి వెళ్లి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే.. ఇప్పుడు చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణా చెప్పమంటే చెబుతున్నారా’ అని అన్నారు. 

శివప్రకాష్రెడ్డి ఫోన్‌ చేస్తేనే వెళ్లాను 
‘ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్రెడ్డి ఫోన్‌ చేశారు. వివేకా చనిపోయినట్లు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికెళ్లమన్నారు. నేను వెళ్లి డెడ్‌బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్‌ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్‌ నోట్‌లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు?  

లెటర్‌లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంక థర్డ్‌ పర్సన్‌ ఫోన్‌కాల్‌ కోసం వెయిటింగ్‌ ఎక్కడ? శివప్రకాష్‌రెడ్డి థర్డ్‌ పర్సనా? వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చా­రు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్‌ పవర్‌ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్స్, సెటిల్‌మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారు’ అని తెలిపారు. 

మా ఇద్దర్నీ గెలిపించాలని వివేకా పిలుపు 
‘నేను చేసే ప్రతి కార్యక్రమాన్నీ వివేకా బల­పర్చేవారు. 2014లో వేంపల్లెలో వీధి వీధీ తిరుగుతూ జగన్నను సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019ఎన్నికల్లో చివరిరోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివే­కాను ఓడించామని చెబుతున్నారు. 854 మంది ఓటర్లలో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైన నా­పైన ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు.  

వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే 
ఆరోజు రాత్రి అంతా నేను ఫోన్‌ వాడినట్లు సునీత చెబుతోంది. నేను ఆరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను. ఫోన్‌ నెట్‌ ఆన్‌లో ఉంటే మేసేజ్‌లు వస్తుంటాయి. నానుంచి ఎవరికీ మెసేజ్‌ కానీ, ఫోన్‌కాల్‌ కానీ వెళ్లలేదు. ఎర్ర గంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్‌ రాలేదు. అంటే వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే. ఎవరెన్ని అబ­ద్దా­లు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. తాను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్‌ ఆఫ్‌ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమా«ధానంగా అవినాశ్‌ రెడ్డి చెప్పారు.  

హార్ట్‌ ఎటాక్‌ అన్నది సునీత కుటుంబం చేసిన ప్రచారమే 
‘హార్ట్‌ ఎటాక్‌ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్‌ ఎటాక్‌తో వివేకానందరెడ్డి చనిపోయినట్లు శివప్రకాష్‌రెడ్డి చెప్పినట్లుగా తెలిపారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్‌ ఎటాక్‌ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్‌నోట్‌ చదివాక కూడా హార్ట్‌ ఎటాక్‌ అని ఎందుకు చెప్పారు’  అని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement