అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్ డిస్క్, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.
తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.
ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment