పంత్‌తో సంజూ (PC: IPL/BCCI)
ఐపీఎల్-2024 ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరో మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.
ఈసారి ఏకంగా 20 జట్లు ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు జట్ల వివరాలను వెల్లడించాయి. ఇందులో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఈ టీమ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ శాంసన్‌లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదిరే ప్రదర్శనతో కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ ఇద్దరూ స్థానం సంపాదించారు.
అయితే, తుదిజట్టులో పంత్, సంజూలలో ఎవరు ఉండాలన్న అంశంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నాడు.
సంజూ కంటే పంత్ బెటర్
ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఐపీఎల్‌లో పంత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజూ శాంసన్ టాపార్డర్‌లో వస్తున్నాడు. పంత్ లెఫ్టాండర్. కాబట్టి మిడిలార్డర్‌లో అతడు ఉంటే జట్టు కూర్పులో వైవిధ్యం ఉంటుంది.
టాపార్డర్‌లో ఇప్పటికే కాంబినేషన్ సెట్ అయింది. కాబట్టి వికెట్ కీపర్ కోటాలో పంత్‌ను తీసుకుంటే మిడిల్ ఆర్డర్‌లో ఆడించవచ్చు’’ అని గంభీర్ విశ్లేషించాడు. టాపార్డర్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో పాటు విరాట్ కోహ్లి ఉన్నారని.. అందుకే సంజూకు ఛాన్స్ దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు.
ఫినిషర్‌గా రాణించగలడు
ఒకవేళ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌నూ తుదిజట్టులో ఆడించాలనుకుంటే.. అతడిని ఆరు లేదంటే ఏడో స్థానంలో పంపిస్తే ఫినిషర్ రోల్ పోషించగలడంటూ గంభీర్ భిన్న రీతిలో స్పందించాడు. కాగా జూన్ 5 ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సంజూ హిట్టు
ఐపీఎల్-2024లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు. మరోరెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన ఈ కేరళ బ్యాటర్.. వ్యక్తిగతంగా 12 ఇన్నింగ్స్‌లో కలిపి 486 పరుగులు సాధించాడు.
మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ 13 మ్యాచ్‌లలో కలిపి 446 పరుగులు చేశాడు.అయితే, ఢిల్లీ 14 మ్యాచ్‌లను పూర్తి చేసుకుని కేవలం ఏడింట గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment