T20: రోహిత్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్‌! | Captain India After Rohit: Harbhajan Wants Sanju To Be Groomed As Next T20I skipper | Sakshi
Sakshi News home page

T20 Captain: ‘రోహిత్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే.. ఎనీ డౌట్‌?’

Published Tue, Apr 23 2024 12:20 PM | Last Updated on Tue, Apr 23 2024 2:06 PM

Captain India After Rohit: Harbhajan Wants Sanju To Be Groomed As Next T20I skipper - Sakshi

టీమిండియా (ఫైల్‌ ఫొటో PC: BCCI)

‘రోహిత్‌ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్‌కప్‌-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత సీన్‌ కాస్తా మారింది. 

గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. ఐపీఎల్‌-2024లో గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్‌ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ మొదలైన తర్వాత సీన్‌ పూర్తిగా మారింది. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది.

ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో సోమవారం నాటి మ్యాచ్‌తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు.


సంజూ శాంసన్‌ (PC: IPL)

ఇప్పటి దాకా రాయల్స్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు.

ముంబైతో మ్యాచ్‌లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్‌(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఫామ్‌ తాత్కాలికం.. క్లాష్‌ శాశ్వతం అని యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌  మరోసారి నిరూపించింది. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు.

టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌ కావాలని ఆకాంక్షించాడు.

అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్‌ కావాంటూ అంటూ కామెంట్‌ చేశడు. కాగా వరల్డ్‌కప్‌-2024 నేపథ్యంలో రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు.  మరి మీ ఓటు ఎవరికి?! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement