T20 WC: మనసులోనే శపిస్తున్నావని తెలుసు: సంజూతో రోహిత్‌! | I Know You Are: Sanju Reveals Rohit Sharma Words Before T20 WC 2024 Final | Sakshi
Sakshi News home page

T20 WC: మనసులోనే శపిస్తున్నావని తెలుసు: సంజూతో రోహిత్‌ శర్మ!

Published Tue, Oct 22 2024 1:50 PM | Last Updated on Tue, Oct 22 2024 5:00 PM

I Know You Are: Sanju Reveals Rohit Sharma Words Before T20 WC 2024 Final

టీ20 ప్రపంచకప్‌-2024 జట్టుకు ఎంపికైనా.. ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు టీమిండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌. రిషభ్‌ పంత్‌ తిరిగి జట్టులోకి వచ్చిన కారణంగా ఈ వికెట్‌ కీపర్‌ను ఈవెంట్‌ ఆసాంతం బెంచ్‌కే పరిమితం చేసింది మేనేజ్‌మెంట్‌. అయితే, ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో రోహిత్‌ సేన చాంపియన్‌గా నిలవడంతో వరల్డ్‌కప్‌ గెలిచిన సభ్యుల జాబితాలో మాత్రం సంజూ తన పేరును లిఖించుకోగలిగాడు.

ఈ నేపథ్యంలో తాజాగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సంజూ శాంసన్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. సౌతాఫ్రికాతో ఫైనల్‌కు ముందు తనకు మేనేజ్‌మెంట్‌ నుంచి మెసేజ్‌ వచ్చిందని.. మెగా మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని యాజమాన్యం చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఆఖరి నిమిషంలో తన అదృష్టం తారుమారైందని.. పాత జట్టుతోనే టైటిల్‌ మ్యాచ్‌ ఆడాలనే నిర్ణయం తీసుకున్నారని సంజూ పేర్కొన్నాడు.

ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జర్నలిస్టు విమల్‌ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఫైనల్‌కు ముందు వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతున్నపుడు రోహిత్‌ నన్ను పక్కకు తీసుకువెళ్లి మాట్లాడాడు.

జట్టు నుంచి నన్ను తప్పిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో వివరించాడు. ‘నేను ఇలా ఎందుకు చేశానో నీకు అర్థమైంది కదా!.. ఆఖరి నిమిషంలో ఇలా కూడా జరుగుతుందని నీకు తెలుసు కదా! ఇది సహజమైన ప్రక్రియే!’ అని నాతో అన్నాడు. అందుకు బదులిస్తూ.. ‘ముందుగా మ్యాచ్‌ గెలవాలి.

ఇప్పుడు మీ దృష్టి మొత్తం మ్యాచ్‌ మీదే పెట్టండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని చెప్పాను. అయితే, నిమిషం తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘మనసులో నాకు శాపనార్థాలు పెడుతున్నావని నాకు తెలుసు. నాకు తెలిసి నువ్వు సంతోషంగా లేవు. మీ మైండ్‌లో ఇంకేదో విషయం ఉందనిపిస్తోంది’ అన్నాడు.

అప్పుడు నేను.. ‘ఓ ఆటగాడిగా మ్యాచ్‌ ఆడాలని నేను ఆశపడటం సహజం. మీ నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా గౌరవిస్తున్నాను. మ్యాచ్‌ ఆడలేకపోయాననే పశ్చాత్తాపం నాకు ఉంటుంది. మీ లాంటి గొప్ప లీడర్‌తో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడలేకపోతున్నాననే బాధ ఉంటుంది. అదొక్కటే నా మెదడును తొలిచివేస్తుంది’ అని అన్నాను’’ అంటూ సంజూ శాంసన్‌ నాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు.

‘‘ఏదేమైనా ఫైనల్‌కు సిద్ధంగా ఉండాలని ముందుగానే చెప్పడంతో నేను మానసికంగా రెడీ అయిపోయా. అయితే, టాస్‌కు ముందు పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించారు. కాస్తత నిరాశకు గురైనా.. పర్లేదు. ఇలాంటివి సహజమే అని సరిపెట్టుకున్నా. 

అయితే, టాస్‌ పడటానికి ముందు కూడా రోహిత్‌ శర్మ నా దగ్గరకు వచ్చి.. నాకోసం పది నిమిషాలు కేటాయించడం మామూలు విషయం కాదు. అతడి స్థానంలో వేరే వాళ్లు ఉంటే ఇలా చేసే వారు కాదేమో’’ అని సంజూ శాంసన్‌ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు.   

చదవండి: ఓవ‌ర్ వెయిట్‌..! టీమిండియా ఓపెన‌ర్‌కు ఊహించ‌ని షాక్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement