పంత్‌తో రోహిత్ సరదా ఫైట్ (PC: ICC)
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అమెరికా వేదికగా లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగుక ముందుకు సాగిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లో జరుగుతున్న సూపర్-8లోనూ శుభారంభం చేసింది.
గ్రూప్-1లో భాగంగా అఫ్గనిస్తాన్ గురువారం నాటి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. అఫ్గన్ జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ ఇన్నింగ్స్‌లో పంత్- రోహిత్ క్యాచ్‌ల విషయంలో పోటాపోటీగా తలపడ్డారు.
బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తంగా మూడు క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ రెండు క్యాచ్‌లు పట్టాడు. అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు.
ఈ క్రమంలో రెండో బంతిని అఫ్గన్ బ్యాటర్ గుల్బదిన్ నయీబ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో పంత్ పరిగెత్తుకు వెళ్లి బంతిని అందుకున్నాడు.
ఆ సమయంలో రోహిత్ కూడా పంత్‌కు సమీపంలోనే ఉండగా.. ఎగ్జైట్‌మెంట్‌లో పంత్ అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సంతోషం పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఈ క్యాచ్ నీదేలే.. నేనేమీ అడ్డుపడను’’ అన్నట్లుగా రోహిత్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ వైరల్‌గా మారింది.
కాగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పంత్.. రహ్మనుల్లా గుర్బాజ్(11), గుల్బదిన్ నయీబ్(17), నవీన్ ఉల్ హక్(0) క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ ఇబ్రహీం జద్రాన్(8), నూర్ అహ్మద్(12) ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment