వాళ్లి‍ద్దరు సూపర్‌.. జట్టులో మార్పులకు సిద్ధం: రోహిత్‌ శర్మ | Important To Use Him Smartly: Rohit Sharma Lauds Jasprit Bumrah Open Play 3 Seamers If | Sakshi
Sakshi News home page

Rohit Sharma: అతడు ఏం చేయగలడో తెలుసు.. తుదిజట్టులో మార్పులకు సిద్ధం

Published Fri, Jun 21 2024 2:23 PM | Last Updated on Fri, Jun 21 2024 4:02 PM

Important To Use Him Smartly: Rohit Lauds Bumrah Open Play 3 Seamers If

వెస్టిండీస్‌లో పిచ్‌ల గురించి తమకు అవగాహన ఉందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గత రెండేళ్లుగా విండీస్‌లో అనేక టీ20 మ్యాచ్‌లు ఆడామని.. ఆ అనుభవం ఇప్పుడు అక్కరకు వస్తోందని తెలిపాడు.

తమ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉందని.. అందుకే అఫ్గనిస్తాన్‌పై అలవోకగా విజయం సాధించామని రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.

బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(28 బంతుల్లో 53), హార్దిక్‌ పాండ్యా(24 బంతుల్లో 32) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్‌ 181 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్‌ భారత బౌలర్లు 134 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఫలితంగా 47 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.

కాగా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా 3, అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ రెండు, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ అఫ్గన్‌పై విజయానికి బౌలర్లే కారణమంటూ వారికి క్రెడిట్‌ ఇచ్చాడు. ‘‘మా బౌలింగ్‌ విభాగంలో టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ విధిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

వారిపై మాకు నమ్మకం ఉంది. ఇక బుమ్రా ఏం చేయగలడో మా అందరికీ తెలుసు. అతడి సేవలను మరింత తెలివిగా ఉపయోగించుకోవడం ముఖ్యం.

అతడు జట్టులో ఉన్నాడంటే కచ్చితంగా తన వంతు బాధ్యత పూర్తి చేస్తాడు. ఇక సూర్య, హార్దిక్‌ భాగస్వామ్యం వల్లే మేము మెరుగైన స్కోరు చేయగలిగాం.  

తదుపరి మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్టు బలాబలాలకు అనుగుణంగా అవసరమైతే మా తుదిజట్టులో మార్పులు చేసుకుంటాం. ఏదేమైనా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే మంచిదని భావిస్తున్నాం.

ఒకవేళ అత్యవసరమైతే ముగ్గురు సీమర్లతో వెళ్లడానికి కూడా నేను సిద్ధమే’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‌తో శనివారం మ్యాచ్‌ ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement