టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనేలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 76 పరుగులే చేశాడు.
ఇక కీలకమైన సూపర్-8 తొలి మ్యాచ్‌లోనూ రోహిత్ విఫలమైన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా 13 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేశాడు రోహిత్.
అఫ్గన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్‌హక్ ఫారూకీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా అఫ్గనిస్తాన్‌పై గెలిచినప్పటికీ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై మాత్రం విమర్శలు వచ్చాయి.
లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోలేడంటూ రోహిత్‌ను ఉద్దేశించి నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘అతడు అనుభవం ఉన్న ఆటగాడు. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. నిజానికి తన ఆట ఎలా ఉండాలో ఒకరితో చెప్పించుకోవాల్సిన స్థితిలో రోహిత్ శర్మ లేనే లేడు.
ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో అతడికి సంబంధం లేదు. అయితే, ఒక్కోసారి మన బలహీనతలు తెలిసిన బౌలర్ ఎదురుగా ఉన్నపుడు ఆన్‌సైడ్ హిట్టింగ్ చేయడం కరెక్ట్ కాదని మీరు అనొచ్చు.
ఇలాంటి సమయంలో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఇన్‌సైడ్ అవుట్ షాట్ ఆడవచ్చు కదా అని భావించవచ్చు. ఇవి కేవలం బయట నుంచి చూసి చెప్పేవి మాత్రమే.
తీరికగా కూర్చుని.. ఎవరు ఎలాంటి షాట్ ఆడాలో చెప్పడం తేలికే. కానీ మైదానంలో దిగి ఆడితేనే కదా తెలిసేది’’ అంటూ గావస్కర్ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా సూపర్-8 దశను అఫ్గన్‌పై విజయంతో మొదలుపెట్టిన టీమిండియా.. శనివారం తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment