మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో | Sakshi
Sakshi News home page

మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో

Published Thu, May 2 2024 4:29 AM

YSRCP Navaratnalu Plus Manifesto More security for middle class

వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌

పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు

123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి

రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా

రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయం

కాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయం

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటు

రూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపు

ఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలు

ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టి, ఆ వర్గాలను ఉన్నత స్థితికి తెస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నవరత్నాలు ప్లస్‌’తో కూడిన మేనిఫెస్టోతో మరోసారి సంపూర్ణ భరోసా కల్పించారు. పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాల దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి.. రూ.2 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల్లో దశలవారీగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే కాకుండా, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అవి..

– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలవనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత వరకు చెల్లించనున్నారు. గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ చెల్లింపుతో ఆర్థిక భరోసానిచ్చారు. 

– ప్రభుత్వ పాలనలో భాగస్వాములుగా ఉంటూ ఆప్కాస్, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు సహా పూర్తి నవరత్న పథకాలను వర్తింజేయనున్నారు. దీనివల్ల రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఈ తరహా ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరగనుంది. వీరితో పాటు ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఆ స్థలం ఖరీదులో ప్రభుత్వం 60 శాతం ఖర్చును భరించనుంది.

– వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా మధ్యతరగతికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.

– వైఎస్సార్‌ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా గతంలో మాదిరిగానే ఏటా రూ.15 వేలు అందిస్తూ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సాయం జమ చేస్తారు.

ఆర్యవైశ్యులకు అండగా..
ఇప్పటికే ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులను సైతం ఇస్తున్నారు తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్‌ను తీసుకొచ్చి అండగా నిలిచారు. ఆర్యవైశ్య సత్రాలను సొంతంగా వారే నిర్వహించే హక్కులను కల్పించారు. ఇంతటి సంక్షేమాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తామంటూ 2024 మేనిఫెస్టో ద్వారా మరోసారి భరోసా ఇచ్చారు.

చెప్పినదానికంటే మిన్నగా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం నవరత్నాలు పథకాలతో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఆర్థిక లబ్ధిని పెద్ద ఎత్తున అందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాల  అక్కచెల్లెమ్మలను సంక్షేమ పథకాలతో ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా 1,66,45,078 మందికి రూ.43,132.75 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా 2,00,59,280 మందికి రూ.86,969.93 కోట్లు కలిపి మొత్తం 3,67,04,358 మందికి రూ.1,30,102.68 కోట్లు లబ్ధి చేకూర్చడం విశేషం.

కాపుల అభివృద్ధికి..
కాపుల సంక్షేమానికి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నూరు శాతం అమలు చేశారు. మేనిఫేస్టోలో చెప్పినదానికి మించి భారీ ఆర్థిక సాయం అందించారు. ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని చెప్పగా.. ఐదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి మొత్తంగా రూ.34,005.12 కోట్లు సాయమందించడం విశేషం. ఇందులో డీబీటీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.84 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ప్రయోజనాలను కల్పించారు. వాస్తవానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ.1,340 కోట్లే.  

Advertisement
 
Advertisement
 
Advertisement