అజేయ సారథికి అత్యున్నత అవార్డు | Sakshi
Sakshi News home page

అజేయ సారథికి అత్యున్నత అవార్డు

Published Thu, Dec 21 2023 2:12 AM

- - Sakshi

తెనాలి, మాచర్ల: ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డిని వరించింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ బుధవారం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు. ఈ గౌరవంతో అజయ్‌కుమార్‌రెడ్డి భారతదేశంలో అర్జున అవార్డుకు ఎంపికై న తొలి అంధ క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. 2010 నుంచి భారత అంధుల క్రికెట్‌ జట్టు క్రికెటర్‌గా ఆడుతూ అనేక విజయాలను సాధించారు. తన సారథ్యంలో భారత అంధుల జట్టును పలుమార్లు విశ్వవిజేతగా నిలిపారు. 2012లో వైస్‌కెప్టెన్‌గా భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌, 2014లో వన్డే వరల్డ్‌ కప్‌ను సాధించారు. జట్టు కెప్టెన్‌గా 2017 టీ20 వరల్డ్‌కప్‌, 2018 వన్డే వరల్డ్‌ కప్‌ను సాధించి, విజయపరంపరను కొనసాగించారు. తన సారథ్యంలోనే 2016లో ఆసియా కప్‌ సాధించగా, గత ఆగస్టులో ఐబీఎస్‌ఏ వరల్డ్‌ గేమ్స్‌ పోటీల్లో జట్టు రజత పతకం సాధించింది. వివిధ దేశాలతో జరిగిన సిరీస్‌ల్లో నూ అద్భుత ఫలితాలను సాధించారు. ప్రస్తుతం అర్జున అవార్డుకు ఎంపిక కావటం తన జీవితంలో మధుర క్షణంగా ‘సాక్షి’తో ఫోన్‌లో చెప్పారు.

స్వస్థలం మాచర్ల..
భారత అంధుల క్రికెట్‌ జట్టును ప్రపంచ విజేతగా నడిపిస్తున్న అజయ్‌కుమార్‌రెడ్డి స్వస్థలం ప్రస్తుత పల్నాడు జిల్లా మాచర్ల. తల్లిదండ్రులు వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి. అన్నయ్య ఆంజనేయరెడ్డి పోలీస్‌ అధికారి. 2011లో డిగ్రీ పూర్తిచేసిన అజయ్‌కుమార్‌రెడ్డికి క్రీడాకోటాలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఉద్యోగం లభించింది. పదోన్నతిపై అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదా దక్కింది. భార్య ప్రియ. వీరికో కుమార్తె. ప్రస్తుతం ఆయన బెంగళూరులో స్టేట్‌బ్యాంక్‌ రీజినల్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. అజయ్‌ పుట్టుకతో అంధుడు కాదు. నాలుగేళ్ల వయసులో తలుపు గడియ తగిలి ఎడమ కంటి చూపు పోయింది. అప్పటివరకు సాధారణ స్కూల్‌లో చదువుకున్నారు. ఆరో తరగతిలో టీచరు బోర్డుపై రాసే అక్షరాలు కనిపించలేదు. కంటి డాక్టరుకు చూపిస్తే, ఇన్ఫెక్షన్‌తో కుడి కన్ను చూపు దెబ్బతిందని చెప్పారు. ఆయన సలహాపైనే 2002లో నరసరావుపేటలోని అంధుల పాఠశాలలో చేర్చారు. అక్కడే క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. 2010 వరకు చదువుకుంటూనే ఎన్నో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడి బహుమతులు గెలుచుకున్నారు. ప్రస్తుతం కేంద్రం అర్జున అవార్డు ప్రకటించిన నేపథ్యంలో మాచర్ల సోమిరెడ్డి బజారులో వారి బంధువులు సంబరాలు జరుపుకొన్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి ఆరో క్రీడాకారుడు..
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అర్జున అవార్డును గెలిచినవారిలో అజయ్‌కుమార్‌రెడ్డి ఆరో క్రీడాకారుడు. గతంలో మొవ్వా శ్యాంసుందరరావు, ఆరికపూడి రమణారావు ఇద్దరూ వాలీబాల్‌ క్రీడలో అర్జున, ద్రోణాచార్య అవార్డులు రెండింటినీ పొందారు. బ్యాడ్మింటన్‌లో కిడాంబి శ్రీకాంత్‌, చదరంగంలో పెండ్యాల హరికృష్ణ, ద్రోణవల్లి హారికలు ‘అర్జున’ గౌరవాన్ని స్వీకరించారు.

అంధుల క్రికెట్‌ విజయ సారథి...
అంధుల క్రికెట్‌ విజయసారథి అజయ్‌కుమార్‌రెడ్డి. 2017 టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో ఏపీ, తెలంగాణలో జరిగిన రెండు మ్యాచ్‌లను మేమే స్పాన్సర్‌ చేశాం. అప్పుడే ఆయనలోని ప్రతిభను, దేశభక్తిని గమనించాను. దేశం కోసం ఆడేందుకు ఎంతైనా కష్టపడటం ఆయన నైజం. భారత ప్రభుత్వం అర్జున అవార్డుకు ఎంపిక చేయటం సముచితం.
– జహరాబేగం, చైర్‌పర్సన్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌, ఆంధ్రప్రదేశ్‌

Advertisement
Advertisement