Sakshi News home page

Aadhaar rules: మారిన ఆధార్‌ రూల్స్‌.. ఇకపై మరింత సులువుగా..

Published Sat, Jan 20 2024 4:33 PM

Aadhaar rules UIDAI update revised forms changing information format - Sakshi

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్‌కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలను జారీ చేసింది. ఆధార్ (నమోదు మరియు నవీకరణ) సవరణ నిబంధనలు, 2024గా పేర్కొంటూ దేశ పౌరులు, ప్రవాస భారతీయులకు ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా కొత్త మార్పులు చేసింది.

యూఐడీఏఐ విడుదల చేసిన జనవరి 16 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నమోదు చేసుకోవడానికి, దానిలోని సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవడానికి రెండు కొత్త ఫారమ్‌లను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్/అప్‌డేషన్ కోసం దేశ పౌరులు, ఎన్నారైలకు వేర్వేరు ఫారమ్‌లను జారీ చేసింది.

సమాచారం అప్‌డేట్‌
యూఐడీఏఐ కొత్త రూల్స్‌ ప్రకారం.. కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో తమ సమాచారాన్ని సులువుగా అప్‌డేట్ చేసుకోవచ్చు. నమోదు కేంద్రం, వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ ద్వారా అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ తాజాగా అవకాశం కల్పించింది. అంతకుముందు 2016లో ప్రవేశపెట్టిన నియమాల ప్రకారం.. చిరునామాల మార్పునకు మాత్రమే ఆన్‌లైన్ మోడ్‌లో అవకాశం ఉండేది. డాక్యుమెంట్‌ అప్‌డేషన్‌, సమాచారం, ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉండేది.

వయసు రుజువు తప్పనిసరి
సవరించిన నిబంధనల ప్రకారం.. వయసు రుజువు కోసం డాక్యుమెంటరీ ఫ్రూఫ్‌ కచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే ఆధార్ కార్డ్‌పై పూర్తి పుట్టిన తేదీని ముద్రిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లేదా కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంట్, వివరాల అప్‌డేట్ చేయవచ్చని యూఏడీఏఐ తెలిపింది. మరోవైపు ఎన్నారైలు ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఎన్నారైలు విదేశీ మొబైల్ నంబర్‌ను అందిస్తే ఆ నంబర్‌కు ఆధార్‌ సంబంధిత మెసేజ్‌లు వెళ్లవు.

సవరించిన ఫారాలు
దరఖాస్తుదారులకు మరింత సులువుగా ఉండేందుకు యూఐడీఏఐ పాత ఫారమ్‌లను సవరించింది. 

  • ఫారం 1: ఆధార్ నమోదు, నవీకరణ
  • ఫారం 2: ఎన్నారైల కోసం 
  • ఫారం 3: దేశంలో చిరునామా ఉన్న ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం
  • ఫారం 4: ఐదు నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న ఎన్నారై పిల్లల కోసం
  • ఫారం 5: భారతీయ చిరునామా ఉన్న ఐదేళ్లలోపు పిల్లల కోసం
  • ఫారం 6: ఐదేళ్ల లోపు ఎన్నారై పిల్లల కోసం 
  • ఫారం 7: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్లు నిండిన విదేశీ పౌరుల కోసం
  • ఫారం 8: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్ల లోపు విదేశీ పిల్లల కోసం
  • ఫారం 9: ఆధార్ నంబర్‌ రద్దు కోసం
     

Advertisement
Advertisement