Rohit Sharma Meets Rinku Singh After T20 WC Press Conference, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Rohit Sharma - Rinku Singh: ప్రపంచకప్‌ జట్టులో నో ఛాన్స్‌.. రింకూతో రోహిత్‌ సీరియస్‌ డిస్కషన్‌

Published Fri, May 3 2024 1:41 PM | Last Updated on Fri, May 3 2024 3:51 PM

రింకూతో రోహిత్‌ డిస్కషన్‌ (PC: MI)

రింకూతో రోహిత్‌ డిస్కషన్‌ (PC: MI)

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించనున్నాడు.

సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌ ద్వారా విరాట్‌ కోహ్లితో పాటు రోహిత్‌ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు అతడి గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా, సూర్య కుమార్‌ యాదవ్‌ భారత జట్టును ముందుకు నడిపించారు.

అయితే, అనుభవానికే పెద్ద పీట వేసిన బీసీసీఐ ఐసీసీ టోర్నీలో మాత్రం రోహిత్‌ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అతడి సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.

రాహుల్‌పై వేటు.. రింకూకు మొండిచేయి
హార్దిక్‌ పాండ్యాకు వైస్‌ కెప్టెన్‌గా ఛాన్స్‌ ఇచ్చిన సెలక్టర్లు.. వికెట్‌ కీపర్‌ కోటాలో రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌లకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌పై వేటు వేశారు. అదే విధంగా.. కచ్చితంగా వరల్డ్‌కప్‌ ఆడతాడనుకున్న నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌కు కూడా మొండిచేయి చూపారు.

ఈ విషయం గురించి గురువారం రోహిత్‌ శర్మతో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పందిస్తూ.. ఇందుకు గల కారణం వెల్లడించాడు. అదనపు బౌలర్‌ అవసరం ఉన్నందు వల్లే దురదృష్టవశాత్తూ రింకూకు చోటివ్వలేకపోయామని తెలిపాడు.

రింకూతో రోహిత్‌ సీరియస్‌ డిస్కషన్‌
ఈ క్రమంలో రోహిత్‌ శర్మ రింకూతో ముచ్చటించిన వీడియో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌-2024లో భాగంగా రోహిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.

వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా హిట్‌మ్యాన్‌ అక్కడికి వెళ్లాడు. కేకేఆర్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు రింకూ, మెంటార్‌ గౌతం గంభీర్‌తో మమేకమయ్యాడు. రోహిత్‌ను చూడగానే రింకూ నవ్వుతూ పలకరించాడు.

ఆ తర్వాత రోహిత్‌ రింకూతో సీరియస్‌గా డిస్కస్‌ చేసినట్లు కనిపించింది. బహుశా వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ గురించే హిట్‌మ్యాన్‌ మాట్లాడి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా వరల్డ్‌కప్‌-2024 జట్టుతో పాటు రింకూ రిజర్వ్‌ ప్లేయర్‌గా ప్రయాణించనున్నాడు.  

టీ20 ప్రపంచకప్‌-2024లో పాల్గొనే టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement