ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టింది. ఈ చర్యల్లో భాగంగా దేశవాళీ పోటీల్లో క్రికెటరలందరూ పాల్గొనాలని, విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ సితాన్షు కోటక్‌ను జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది.
ఈ పదవికి పోటీ పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రఖ్యాత ఇంగ్లండ్ బ్యాటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తన సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా తన సంసిద్ధతను వ్యక్తం చేసాడు. అయితే బీసీసీఐ ముందే ఈ విషయం పై ఒక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టించిన సితాన్షు కోటక్‌ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది.
కోటక్ దేశవాళీ క్రికెట్‌లో 10,000 పరుగులు పైగా సాధించాడు కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. 2013లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత, కోటక్ కోచింగ్ రంగంలోకి దిగి తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2020లో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. 2019 నుండి నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇటీవలి కాలంలో భారత్ వైట్-బాల్ సిరీస్‌లో వివిఎస్ లక్ష్మణ్‌కు సహాయ కోచ్‌గా సేవలందించాడు . బుధవారం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరగబోయే టి20 సిరీస్తో కోటక్ తన బాధ్యతలు చేపట్టనున్నాడు.
కోటక్ నియామకం తప్పనిసరి
ఇటీవల స్వదేశం, విదేశాలలో జరిగిన సిరీస్ల్లో భారత్ బ్యాటర్లు పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అయితే అంతకుముందు స్వదేశంలో న్యూజిల్యాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్ ల పై సైతం భారత బ్యాటర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు 0-3 తేడాతో పరాజయం పాలైంది. అప్పుడే బీసీసీఐ బ్యాటింగ్ కోచ్ ని నియమించి వుంటే ఆస్ట్రేలియా సిరీస్ లో కొద్దిగా పరువు దక్కేది. ఈ నేపథ్యంలో కోటక్ నియామకం కొద్దిగా ఆలస్యమైనా సరైన నిర్ణయం గా కనిపిస్తోంది.
బ్యాటింగ్ కోచ్‌గా అనుభవం..
అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించకపోయినా, కోటక్ రెండు దశాబ్దాల పాటు దేశవాళీ పోటీల్లో రాణించాడు. ఫస్ట్-క్లాస్ మరియు లిస్ట్ ఎ ఫార్మాట్లలో కలిపి 10,000 పైగా పరుగులు సాధించాడు. కోటక్ వార్విక్‌షైర్‌తో కౌంటీ క్రికెట్‌లో కూడా కొంతకాలం ఆడాడు. కోటక్ 130 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 15 సెంచరీలు మరియు 55 అర్ధ సెంచరీలతో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశాడు. ఇంకా 89 లిస్ట్ ఎ మ్యాచ్ లలో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 42.23 సగటుతో 3,083 పరుగులు సాధించాడు.
అన్ని ఫార్మాట్లలో కోచింగ్ సమర్ధత
కోటక్ బీసీసీఐ, వేల్స్ క్రికెట్ బోర్డు నుండి లెవల్ 1 మరియు లెవల్ 2 కోచింగ్ పరీక్షలు పూర్తిచేసాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఇండియా ఎ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో అనుభవం గడించిన కోటక్ కొంతకాలం భారత పరిమిత ఓవర్ల జట్టుకి సహకారం కూడా అందించాడు. కోటక్ ఐపీల్ లో 2016లో గుజరాత్ లయన్స్‌కు సహాయ కోచ్‌గా పనిచేశాడు. సురేష్ రైనా, ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వంటి ఆటగాళ్లతో కలిసి పనిచేసి రాటుదేలాడు.
ఇటీవలి కాలంలో కోటక్ భారత జట్టుతో కలిసి పలు పర్యటనలకు వెళ్ళాడు. రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్ అందుబాటులో లేని సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ కి సహాయ కోచ్ గా పని చేశాడు. 2023లో జస్ప్రిత్ బుమ్రా నేతృత్వంలో భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడినప్పుడు కోటక్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్ల అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ లో మార్పులు చేయగల ప్రజ్ఞాపాటవాలు కోటక్ కి పుష్కలంగా ఉన్నాయి.
అయితే జట్టులోని ఎంతో అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్మన్ కి కొత్తగా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా వంటి పిచ్ ల పై భారత్ బ్యాట్స్మన్ రాణించిన సందర్భాలు తక్కువే. అయితే ఇటీవల కాలంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి హేమాహేమీలు వచ్చిన తర్వాత భారత బ్యాటర్లు విదేశీ పర్యటనలలో కూడా రాణించగలమని నిరూపించుకున్నారు.
ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ ల లో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో బీసీసీఐ జట్టు లోపాల్ని సరిదిద్దడానికి నడుం కట్టింది. ఇందులో భాగంగా కోటక్ ని బ్యాటింగ్ కోచ్ గా నియమించారు. అయితే ఇది సత్ఫలితాలను ఇస్తుందా లేదా అన్న విషయం రాబోయే ఇంగ్లాండ్ పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ తో తేలిపోతుంది. కోటక్ కి ఇది అగ్ని పరీక్షే!
Comments
Please login to add a commentAdd a comment