రింకూ సింగ్ (PC: KKR/IPL)
సానుకూల దృక్పథం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా ముందుకు సాగవచ్చంటున్నాడు టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్. టైమ్ బాగాలేదంటూ కాలం వృథా చేసే మనిషిని కాదని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు రోజులు బాగానే గడుస్తున్నాయని తెలిపాడు.
క్రికెటర్‌గా జూనియర్ లెవల్‌లో ఎన్నో ట్రోఫీలు గెలిచానన్న రింకూ సింగ్.. ఈసారి ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం తనకు తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే టీ20 ప్రపంచకప్-2024 కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రింకూకు అన్యాయం జరిగిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టారు.
అయితే, తాను మాత్రం ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివీతోనే ఉంటానని రింకూ సింగ్ అంటున్నాడు. ‘‘సాకులు వెదుక్కునే వాళ్లే టైమ్ బాగాలేదని చెప్తూ ఉంటారు. నాకు అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నాయి కాబట్టి మన టైమ్ బాగున్నట్లే కదా.
టీమిండియా వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోయినపుడు చాలా మంది ఏడ్చారు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సి ఉంటుంది! నిజానికి నేను జూనియర్ లెవల్‌లో ట్రోఫీలు గెలిచాను. కానీ సీనియర్ లెవల్లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు.
అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్ రూపంలో మెగా టోర్నీలో భాగం కాబోతున్నాను. ఈసారి వరల్డ్‌కప్‌ను నా చేతుల్లోకి తీసుకుంటాననే అనుకుంటున్నా. మేజర్ ఈవెంట్లో ట్రోఫీ గెలవాలన్నది ప్రతి ఒక్క క్రికెటర్ కల’’ అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ ఈ ఏడాది 11 ఇన్నింగ్స్ ఆడి కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం అతడు క్వాలిఫయర్-1 ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. అహ్మదాబాద్‌లో మంగళవారం జరుగనున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్
Comments
Please login to add a commentAdd a comment