టీ20 వరల్డ్‌కప్-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.
అయితే ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, నయా ఫినిషర్ రింకూ సింగ్‌లను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.
ఈ మెగా ఈవెంట్‌కు కేఎల్ రాహుల్‌ను పూర్తిగా పరిగణలోకి తీసుకోని సెలక్టర్లు.. రింకూను మాత్రం స్టాండ్ బైగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో రింకూకు ప్రధాన జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా వ్యతిరేకించాడు.
రింకూ సింగ్ లాంటి పవర్ హిట్టర్‌ను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు తీసుకున్న చెత్త నిర్ణయమని శ్రీకాంత్ మండిపడ్డాడు.'రింకూ సింగ్ ఏం తప్పు చేశాడు. సెలక్టర్ల నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది.
ప్రస్తుతం ఇదే విషయం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తను ఇప్పటివరకు భారత్ తరపున ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ సత్తాచాటాడు. అతడు గతంలో దక్షిణాణఫ్రికాతో సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు.
అటువంటి అద్భుత ఆటగాడిని ఎందుకు వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదు? అతడి బదులు జైశ్వాల్‌ను పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రింకూ సింగ్ కచ్చితంగా వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.
అస్సలు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? కొంతమందిని సంతోషపెట్టడానికి రింకూ సింగ్‌ను బలి పశువు చేశారని' తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్ పేర్కొన్నాడు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
Comments
Please login to add a commentAdd a comment