స్టార్క్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన రింకూ! మెరుపు ఇన్నింగ్స్‌ | Rinku Singh Smashes Starc For Massive Six In KKR Pre-IPL 2024 Practice Match | Sakshi
Sakshi News home page

స్టార్క్‌కు చుక్కలు.. భారీ సిక్సర్‌ బాదిన రింకూ! మెరుపు ఇన్నింగ్స్‌

Published Wed, Mar 20 2024 12:26 PM | Last Updated on Wed, Mar 20 2024 12:55 PM

Rinku Singh Smashes Starc For Massive Six KKR Pre IPL 2024 Practice match - Sakshi

స్టార్క్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన రింకూ(PC: KKR X)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఐపీఎల్‌-2024 సన్నాహకాల్లో తలమునకలైంది. కేకేఆర్‌ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా- స్వ్కాడ్‌ మ్యాచ్‌తో బిజీబిజీగా గడిపారు. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో చెమటోడ్చారు.

ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ స్టార్‌, టీమిండియా నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌, ఐపీఎల్‌ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ మధ్య పోరు హైలైట్‌గా నిలిచింది. 

సన్నాహకాల్లో భాగంగా టీమ్‌ పర్పుల్‌, టీమ్‌ గోల్డ్‌గా విడిపోయిన కేకేఆర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్‌ చేసింది. పర్పుల్‌కు స్టార్క్‌ సారథ్యం వహించగా.. టీమ్‌ గోల్డ్‌లో ఉన్న రింకూ సింగ్‌ అతడికి చుక్కలు చూపించాడు.

వరల్డ్‌క్లాస్‌ పేసర్‌ అయిన స్టార్క్‌ బౌలింగ్‌లో రింకూ భారీ సిక్సర్‌ బాదాడు. కళ్లు చెదిరే రీతిలో మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌ కొట్టి సత్తా చాటాడు. అంతేకాదు స్టార్క్‌ బౌలింగ్‌లో బాగానే పరుగులు పిండుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. రింకూ సింగ్‌ 16 బంతుల్లోనే 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

అదే విధంగా కేకేఆర్‌లో జేసన్‌ రాయ్‌ స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్తగా వచ్చిన ఫిల్‌ సాల్ట్‌ 41 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక వైస్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా 30 బంతుల్లో 50 పరుగులతో రాణించగా... మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఎట్టకేలకు టీమ్‌ పర్పుల్‌ విజయం సాధించింది. 

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కోసం కేకేఆర్‌ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అతడు ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ సన్‌రైజర్స్‌తో మార్చి 23న తొలి మ్యాచ్‌ ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement