రోహిత్‌ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో! | Rohit Sharma Wont Be At MI Imagine He Open At: Pace Legend Wasim Akram Massive Prediction | Sakshi

రోహిత్‌ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్‌ కెప్టెన్సీలో!

Published Thu, May 9 2024 2:28 PM | Last Updated on Thu, May 9 2024 5:57 PM

Rohit Sharma Wont Be At MI Imagine He Open At: Pace Legend Massive Prediction

ఐపీఎల్‌-2024లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్‌ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.

తాజా ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. 

ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే
పాండ్యా సారథ్యంలో ఇ‍ప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొంది.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్‌, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రోహిత్‌ శర్మ కన్నీళ్లు
స్టార్‌ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్‌ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. 

ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో హిట్‌మ్యాన్‌ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ పేస్‌ లెజెండ్‌ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

రోహిత్‌ ముంబైని వీడతాడు
వచ్చే ఏడాది రోహిత్‌ శర్మ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్‌ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.

అతడు కేకేఆర్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్‌) మెంటార్షిప్‌లో.. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.

గొప్ప ఆటగాడు
ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ మీద రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్‌. అతడు కేకేఆర్‌లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. 

ఇక ఈ సీజన్‌లో ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్‌ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!

చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్‌.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement