‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్‌ చేశారు’ | Not In Best Form Otherwise: Riyan Parag Stuns Everyone With Post Match Comments | Sakshi
Sakshi News home page

T20 WC: ‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను సెలక్ట్‌ చేసినందుకు హ్యాపీ’

Published Fri, May 3 2024 12:49 PM | Last Updated on Fri, May 3 2024 3:19 PM

రియాన్‌ పరాగ్‌ (PC: IPL)

రియాన్‌ పరాగ్‌ (PC: IPL)

‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్‌లో లేను. ఒకవేళ ఫామ్‌లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్‌ను విజయంతో ముగించేవాడిని.

నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.

రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్‌ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ అన్నాడు.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్తాన్‌ గురువారం తలపడింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రియాన్‌ పరాగ్‌ ఇన్నింగ్స్‌ వృథా
ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్‌ సీనియర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రోవ్‌మన్‌ పావెల్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్‌ కథ ముగిసిపోయింది.

ఫలితంగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్‌ పరాగ్‌ ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా వరల్డ్‌కప్‌-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్‌ ప్లేయర్‌గా అయినా పరాగ్‌కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది.

 సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషం
ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్‌ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.

నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. 

మా జట్టు నుంచి వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్‌ పరాగ్‌ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.

ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్‌ పరాగ్‌.. ఈ సీజన్‌లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు.

చదవండి: SRH: కావ్యా మారన్‌ వైల్డ్‌ సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement