టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై సందేహాలు అక్కర్లేదని.. కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.
ఒకవేళ రోహిత్ శర్మ ఏదేని కారణాల చేత ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లకు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పాండ్యాకు సూచించాడు. ఐపీఎల్ వైఫల్యాలు మరిచి వరల్డ్‌కప్‌నకు రెడీగా ఉండాలని ఓజా చెప్పుకొచ్చాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి కోలుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్-2024 బరిలో దిగాడు.
అయితే, ఆశించిన స్థాయిలో రాణించకపోలేతున్న పాండ్యా కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అతడి సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడి కేవలం మూడే గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానమే ఇవ్వకూడదనే డిమాండ్లు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం మెగా ఈవెంట్లో ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది.
ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అతడు నిజమైన నాయకుడిగా బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ రోహిత్‌కు ఏమైనా జరిగితే.. అలా జరగాలని మనం కోరుకోము.
కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు జట్టు దూరమైతే హార్దిక్ పాండ్యానే జట్టును ముందుకు నడిపించాలి కదా. కాబట్టి హార్దిక్ అందుకు అన్ని వేళలా సన్నద్ధంగా ఉండాలి.
బ్యాటర్‌గానూ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. నిజానికి అతడు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుంది. టీమిండియా సెలక్షన్ గురించి ఎవరు మాట్లాడినా తొలుత హార్దిక్ పేరే గుర్తుకువస్తుంది.
అవసరమైన వేళ అదనపు బ్యాటర్‌గా.. బౌలర్‌గా తను సేవలు అందించగలడు. ఐపీఎల్‌లో ఏం జరుగుతుందన్న విషయం గురించి పక్కనపెట్టి వరల్డ్‌కప్ పైన శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించడానికి హార్దిక్ పాండ్యా సన్నద్ధంగా ఉండాలి’’ అని సూచించాడు.
కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. టీమిండియా జూన్ ఐదున తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment