రోహిత్‌కు బైబై.. టీమిండియా టీ20 కెప్టెన్‌గానూ హార్దిక్‌ పాండ్యా! | IPL 2024: Why Rohit Sharma Removed As Mumbai Indians Captain, Is This Hint Of WC 2024 Captaincy - Sakshi
Sakshi News home page

#Rohit Sharma: రోహిత్‌కు బైబై.. ఇక టీమిండియా టీ20 కెప్టెన్‌గానూ హార్దిక్‌ పాండ్యా!?

Published Sat, Dec 16 2023 3:09 PM | Last Updated on Sat, Dec 16 2023 4:39 PM

IPL 2024 Rohit Removal As MI Captain Why Is This Hint Of WC 2024 Captain - Sakshi

హార్దిక్‌ పాండ్యా- రోహిత్‌ శర్మ (PC: BCCI)

Rohit Sharma- Hardik Pandya- T20 Captaincy: ఐపీఎల్‌-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ తీసుకుంటున్న నిర్ణయాలు క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఫామ్‌లేమి, గాయాల బెడద కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌కు ముందు వదిలేసిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను.. అనూహ్య రీతిలో భారీ మొత్తానికి ట్రేడ్‌ చేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా విజయవంతమైన పాండ్యాను తిరిగి తమ గూటికి రప్పించుకుంది.

ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలోనే ఖరీదైన ట్రేడింగ్‌గా ముంబై- హార్దిక్‌ ఒప్పందం నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ద్వారా మరో సంచలనానికి తెరతీసింది ముంబై ఇండియన్స్‌. తమ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి తారస్థాయిలో నిలబెట్టిన హిట్‌మ్యాన్‌ను కాదని పాండ్యాను సారథిగా నియమించింది.

స్పష్టమైన కారణం లేదు!
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పర్ఫామెన్స్‌ మహేలా జయవర్ధనే చెప్పినప్పటికీ.. సీజన్‌ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఎలాంటి స్పష్టమైన కారణం బయటకు కనిపించడం లేదు. 

ఇప్పటికీ మంచి ఫామ్‌తో భారత జట్టు నాయకుడిగా కూడా కొనసాగుతున్న రోహిత్‌ను పక్కన పెట్టడం అంటే అంతర్గతంగా ఏదైనా జరిగి ఉండాలి. గత మూడు సీజన్లలో జట్టు ప్రదర్శన గొప్పగా లేకపోయినా సరే... మార్కెటింగ్‌ పరంగా కూడా రోహిత్‌ విలువేమీ తగ్గలేదు. లేదంటే రోహిత్‌ తానే స్వయంగా సారథిగా ఇక చాలు, ఈ సీజన్‌లో ఆటగాడిగా మాత్రమే కొనసాగాలని భావిస్తున్నట్లు చెప్పి ఉండవచ్చు.

పాండ్యాకు ఇంట్రస్ట్‌
అయితే, భారీ మొత్తం చెల్లించి గుజరాత్‌ నుంచి హార్దిక్‌కు ఎలాగైనా తీసుకునేందుకు ముంబై ఇండియన్స్‌ చేసిన ప్రయత్నం చూస్తేనే జట్టు ప్రణాళిక ఏమిటో అర్థమవుతుంది. పాండ్యా కూడా కెప్టెన్సీ హామీ మేరకే ముంబైకి తిరిగి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

నిజానికి గత రెండు సీజన్లలో టైటాన్స్‌కు సారథ్యం వహించినా... ముంబై కెప్టెన్సీపైనే పాండ్యా మక్కువ పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ అగ్రశ్రేణి ముంబై ఇండియన్స్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో రోహిత్‌ భారత టి20 జట్టు కెప్టెన్సీ కూడా సందేహంలోనే పడింది.

టీమిండియా టీ20 కెప్టెన్‌గానూ హార్దిక్‌ పాండ్యానే!
రోహిత్‌ లేని సమయంలో భారత్‌ ఆడిన గత 25 టి20ల్లో 13 మ్యాచ్‌లలో నాయకత్వం వహించిన హార్దిక్‌ పాండ్యానే వచ్చే టి20 వరల్డ్‌ కప్‌లోనూ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. బ్యాటర్‌గా మాత్రమే రోహిత్‌ టి20ల్లో కొనసాగుతాడా అనేది కూడా చెప్పలేం. ఎందుకంటే 2020 టి20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఓటమి తర్వాత రోహిత్‌ ఒక్క అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ కూడా ఆడలేదు.

ఇక ముందు ఆడే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియాకు ఇంకా కేవలం మూడు టీ20 మ్యాచ్‌(అఫ్గనిస్తాన్‌తో)లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్‌-2024లోనూ రోహిత్‌ శర్మ పూర్తిస్థాయిలో ఆడతాడా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. మొత్తానికి పొట్టి ఫార్మాట్లో అరుదైన రికార్డులు సాధించిన రోహిత్‌ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడన్నది క్రీడా వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

చదవండి: భారత జట్టులోనూ ‘వై నాట్‌ ఏపీ’.. సీఎం జగన్‌ విజన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement