
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, ఎల్‌ఎస్‌జీ తలపడ్డాయి. లక్నో హోం గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 87 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చినా ఆ ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆఖర్లో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 36) బ్యాట్ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. మార్క్రమ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన పంత్ ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్‌గా కూడా విఫలమైన పంత్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో లక్నోకు ఢిల్లీ చేతిలో ఇది రెండో ఓటమి. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది.
నిన్నటి మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా బాధగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. ఈ మైదానంలో టాస్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తొలుత బౌలింగ్ చేసే జట్టుకు వికెట్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఛేజింగ్ సమయంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్‌పై ఇది ఎప్పుడూ జరిగేదే. దీన్ని సాకుగా చూసి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కు వెళ్లడంపై స్పందిస్తూ.. వికెట్ తీరును సద్వినియోగం చేసుకుంటాడని సమద్‌ను ముందుగా పంపాము. మిల్లర్‌ను సైతం అదే ఉద్దేశంతో నా కంటే ముందు బరిలోకి దించాము. వికెట్ తీరు ముందు ఇవేవి వర్కౌట్ కాలేదు.
తదుపరి మ్యాచ్‌లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. బృంద సభ్యులందరం కలిసి కూర్చుంటాము. అప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్‌పై డిస్కస్ చేస్తాము. ఈ ఓటమిని ఇక్కడే మరచిపోయే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాము.
ఈ మ్యాచ్‌లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం కిందికి దిగజారలేదు. అయితే రన్‌రేట్ మాత్రం మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు -0-054 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో (10 పాయింట్లు) కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ చెరి 12 పాయింట్లతో టాప్-2లో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.