పేటీఎం బాస్‌ విజయ్‌ శేఖర్‌ శర్మకు భారీ ఊరట! | Sakshi
Sakshi News home page

పేటీఎం బాస్‌ విజయ్‌ శేఖర్‌ శర్మకు భారీ ఊరట!

Published Wed, Feb 28 2024 5:06 PM

Datum Intelligence Survey: Rbi Action On Paytm Not Impacting Merchants - Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌)పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అయితే, ఆ ఆంక్షలు పేటీఎంపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

గురుగావ్‌కు కేంద్రంగా బిజినెస్‌ కన్సల్టింగ్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీ డేటామ్ (Datum Intelligence) ఇంటెలిజెన్స్‌.. పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ చర్యలు పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోయాయని తెలిపింది. ఇప్పటికీ 59 శాతం మంది వ్యాపారస్తులు పేటీఎంనే వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

డేటామ్‌ ఇంటెలిజెన్స్‌ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు 12 నగరాల్లో 2వేల మందిని సర్వే చేసింది. అందులో ఈ ఫలితాలు వచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ సర్వేలో పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుందోనని తెలుసుకునేందుకు 21శాతం మంది వ్యాపారస్థులు ఎదురు చూస్తున్నారు. 13 శాతం మంది పేటీఎం నుంచి ఇతర పేమెంట్‌ అప్లికేషన్‌లను వినియోగించేందుకు సిద్ధమయ్యారు. 


పేటీఎంకే మా మద్దతు

దీంతో పాటు 76 శాతం మంది నగదు చెల్లింపుల కోసం పేటీఎంను ఉపయోగించేందుకు మద్దతు పలుకుతుండగా  41 శాతం మంది ఫోన్‌పే, 33 శాతం మంది గూగుల్‌పే, 18 శాతం మంది భారత్‌ పేని ఉపయోగిస్తున్నారు. సర్వే చేసిన 58 శాతం వ్యాపారులకు పేటీఎంకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత ఫోన్‌పేకి 23 శాతం, గూగుల్‌ పేకి 12 శాతం, మూడు శాతం భారత్‌పే వైపు మొగ్గు చూపుతున్నారు.  

పేటీఎంపై నమ్మకం.. కారణం అదే
ఆర్‌బీఐ వరుస కఠిన నిర్ణయాలతో పేటీఎం భారీగా నష్టపోతుంది. అయినప్పటికీ ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం ప్రతినిధులు వ్యాపారస్థులతో వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో వ్యాపారుల్లో పేటీఎంపై నమ్మకం కొనసాగడానికి కారణమని సర్వే నివేదిక హైలెట్‌ చేసింది.  

పరిమితంగానే ప్రభావం
ఇక 71 శాతం మంది వ్యాపారులు పేటీఎం ప్రతినిధిని సంప్రదించిన తర్వాత చెల్లింపుల కోసం పేటీఎంని ఉపయోగించడం కొనసాగించాలనే నమ్మకంతో ఉన్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే  పేటీఎంపై నమ్మకం సన్నగిల్లింది. మిగిలిన 14 శాతం మంది ఇప్పటికీ మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు’ అని డేటామ్ ఇంటెలిజెన్స్ సర్వే తెలిపింది. దీన్ని బట్టి  ఆర్‌బీఐ చర్యల ప్రభావం పేటీఎంపై పరిమితంగా ఉంది. నష్టాన్ని తగ్గించడానికి పేటీఎం వ్యాపారులతో మంతనాలు జరుపుతుండగా.. వ్యాపారులు సైతం ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకునే ముందు వేచి చూసే ధోరణి కొనసాగుతుంది. 

Advertisement
Advertisement