దీనిని మేం ఆమోదిస్తున్నాం.. రీ సర్వే సాహసోపేతం
ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది.. రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కోరింది
2019 జూలై 29న అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రసంగం.. ఎన్నికల వేళ
ఆనవాయితీగా నాలుక మడతేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: ప్రతి విషయంలోనూ రెండు నాలుకల ధోరణిని పాటించే ప్రతిపక్ష నేత చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టంపైనా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు బురద చల్లుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్బిల్లును ప్రవేశపెట్టింది. అదే ఏడాది జూలై 29న దీనిపై సభలో జరిగిన చర్చలో టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతు తెలిపి పలు సూచనలు కూడా చేశారు. నాడు పయ్యావుల ఏమన్నారంటే..
బిల్లు అవసరాన్ని కేంద్రం కూడా గుర్తించింది
ఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్లే బిల్లు. బిల్లుని మేం ఆమోదిస్తున్నాం. మంత్రిగారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూములు కొనాలంటే భయపడే పరిస్థితులున్నాయి. అది నిజమైన టైటిలా? డిస్ప్యూటెడ్ (వివాదాస్పద) టైటిలా? అనేది తెలియడంలేదు. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ల్యాండ్ టైటిల్ క్లియర్‌గా లేకుంటే సమస్య అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ స్కీమ్ ప్రారంభించి రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కోరింది. కర్నాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉంది.
ఈ ప్రాజెక్టు మన దేశానికి కొత్త కావచ్చు కానీ 1858లోనే ఆస్ట్రేలియాలో ఉంది. టోరెన్స్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైట్లింగ్ అనే విధానం.. అంటే టైటిల్‌కి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ తర్వాత చాలా దేశాలు దీన్ని అమలు చేశాయి. రాజస్థాన్–2016లోనే దాదాపు ఇలాంటి చట్టాన్నే పాస్ చేసింది. కానీ ప్రాక్టికల్‌గా అమల్లోకి వెళ్లినట్లు కనపడలేదు. ఆశయాలు మాత్రం చాలా గొప్పవి. ఆచరణలో ఈ ప్రభుత్వమే కాదు.. ఎవరు చేపట్టినా చాలా సమస్యలతో కూడుకున్నది ఇది. చిక్కులను తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి చాలా టైమ్ పడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది రెండేళ్లలో అవుతుందా? నాలుగేళ్లు పడుతుందా? ఐదేళ్లు పడుతుందా? అనేది పక్కన పెడితే తప్పకుండా ఇదొక పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్లే బిల్లు అవుతుంది.
రీ సర్వే సాహసోపేతం
ల్యాండ్ టైట్లింగ్‌కంటే ముందు సర్వే చేయాలి. సర్వే కూడా ప్రభుత్వం పెద్దఎత్తున చేసే ఆలోచనలో ఉందని తెలిసింది. చాలా బృహత్తర కసరత్తు. 1900 సంవత్సరంలో ల్యాండ్ సర్వే డిపార్టుమెంట్ ఏర్పడితే 1970కి గానీ మనకి అప్‌డేటెడ్ రికార్డులు రాలేదు. మనం రెండేళ్లలో చేస్తామంటున్నాం. టెక్నాలజీ, మ్యాన్ పవర్ ఉన్నా ఇదొక సాహసోపేతమైన చర్య. సరిగ్గా చేయకపోతే ఇదొక దుస్సాహసం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలకు భూమి మీద ఉన్న మమకారం చాలా గొప్పది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి రూ.1500 కోట్లు అవసరమయ్యే ప్రాజెక్టు ఇది. ప్రభుత్వంలో ఎవరున్నా రీ సర్వే 40 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలి. ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే చర్య.
Comments
Please login to add a commentAdd a comment