భూ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌కు, పచ్చ మీడియాకు కడుపు మంట
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తిని ఎవరు లాక్కోగలరు?
సీఎం జగన్ ఫొటో పట్టాదారు పాసుపుస్తకంపై వేస్తే ఆ స్థలం సీఎంకి చెందుతుందా?
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా కథనాలు రాయడం పాపం, పెద్ద నేరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, పవన్‌కు, పచ్చ మీడియాకు ఇంత కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ అని ప్రశ్నించారు. అసలు ఈ చట్టంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. అన్నం తినేవాళ్లు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి రాతలు రాయరని అన్నారు.
వారిది క్రిమినల్ మైండ్ అని, అందుకే ఇలాంటి సున్నితమైన సమస్యపై ప్రజల్లో అపోహలు సృష్టించి, ఎన్నికల్లో దీన్నొక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ‘సీఎం జగన్ ఫొటో పట్టాదారు పాసుపుస్తకంపై వేస్తే ఆ స్థలం సీఎంకి చెందిపోతుందా? మరి అప్పట్లో మరుగుదొడ్లపై ఎన్టీఆర్ బొమ్మ వేశారు కదా. ఆ మరుగుదొడ్లన్నీ ఎన్టీఆర్ సొంతమైపోతాయా’ అని ప్రశ్నించారు. బొత్స శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూవివాదాల్లో అవినీతి, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా చేయడానికే ఈ చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు.
ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని సాక్షాత్తు సీఎంగారే చెప్పారన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా లోపభూయిష్టమైన విధానాలను మార్చి సామాన్యుడికి మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా భూ వ్యవస్థలో లోపాలను సవరించి, చట్టాలు తేవాలన్న కేంద్రనిర్ణయంలో భాగంగానే తమ ప్రభుత్వం కూడా అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తోందని, దానికింకా బోలెడంత ప్రాసెస్ ఉందని తెలిపారు.
ప్రజాభిప్రాయ సేకరణ, సర్వే పూరైన గ్రామాలే ఈ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. తొలుత గ్రామాల్లో భూసర్వే జరగాలని, ఆ సమయంలో వివాదాలు వస్తే ఎమ్మార్వో ఆఫీసులో ఇద్దరినీ కూర్చోబెట్టి పరిష్కరిస్తారని తెలిపారు. ఒక వేళ అక్కడ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఆ భూమి హక్కులు ఎవరికీ ఇవ్వరని, ఆ తర్వాత జిల్లా జడ్జి స్థాయిలో అప్పిలేట్ అథారిటీకి, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చని చెప్పారు. ఇది కూడా కోర్టులో ఉందని చెప్పారు.
ప్రస్తుతం ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదని స్పష్టం చేశారు. ఈ లోపే మీటింగులు పెట్టి.. ఒకరు జోగిపోయి, ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాతలు ఎన్నికల వరకేనని అన్నారు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికల్లో వారి కూటమికి లాభం చేకూర్చాలన్నదే వీరి దురుద్దేశమని తెలిపారు.
లిటిగేషన్ తగ్గించడానికే..
దీనిలో జిల్లా అప్పిలేట్ విచారణ తర్వాత కింది కోర్టుల పరిధి ఉండదని, అందుకే కొందరు న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేవలం లిటిగేషన్ తగ్గించడానికే కింది కోర్టుల పరిధి తీసేశామన్నారు. జిల్లా జడ్జి స్థాయి అధికారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ కింది కోర్టులకు ఎలా వెళ్తామని అన్నారు. సామాన్య ప్రజలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సర్వే జరగబట్టి రికార్డులు సరిగ్గా లేక కోర్టు వివాదాలు వస్తున్నాయన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తోందని, మొదటి దశ పూర్తయి, రెండో దశ కొనసాగుతోందని చెప్పారు. తర్వాత పట్టణ ప్రాంతాల్లో కూడా సర్వే చేస్తామన్నారు.
పవనేమన్నా పెద్ద మేధావా?
పవ¯న్ కళ్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని, ఆయనేమన్నా పెద్ద మేధావా అని బొత్స ప్రశ్నించారు. ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్ కాపీలు ఇస్తారా? అన్నం తినేవాడు మాట్లాడే మాటలేనా అని మండిపడ్డారు. జిరాక్స్ కాపీలు తీసుకోవడానికి ప్రజలు అమాయకులనుకుంటున్నారా, వారు ఒప్పుకొంటారా అని ప్రశ్నించారు.
ఇలాంటి ప్రచారం తప్పు అని చాలాసార్లు చెప్పానని అన్నారు. ఆయనొక రాజకీయ నాయకుడు.. ఆయన ఆరోపణలకు మా ఖర్మకి మేం సమాధానం చెప్పాలా అని పవన్‌పై మండిపడ్డారు. అన్నం తినే వాడెవ్వడూ పవన్ మాటలను హర్షించరన్నారు. తెలిసీ తెలియని అంశాలపై ఏవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment