
అమిత్ షా పిల్లలు, మనుమలు ఏ మీడియంలో చదివారు?
తెలుగు భాషను చంద్రబాబు ఉద్ధరించిందేమీ లేదు
సీఎం జగన్ తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్నారు
ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగు భాష ప్రాభవం ఎక్కడా తగ్గలేదు
పెత్తందార్లే ఇంగ్లిష్ మీడియంను జీర్ణించుకోలేకపోతున్నారు
అమిత్ షా టీడీపీ స్క్రిప్టునే చదివారు
పోలవరం ఆలస్యానికి చంద్రబాబు పాపాలే కారణం
టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసిన తర్వాతే రాష్ట్రానికి అన్యాయం మొదలైంది
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పడాన్ని అమిత్ షా తప్పు పట్టడం శోచనీయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో బోధనపై ఇంతలేసి మాటలంటున్న అమిత్ షా, ఇతర నేతల పిల్లలు, మనుమలు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీశారు. సజ్జల ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు భాషను చంద్రబాబు ఉద్ధరించిందీ లేదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం తగ్గించిందీ లేదు.
ఇంకా సీఎం జగన్ తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే 94 శాతానికి పైగా తల్లిదండ్రులు వారి బిడ్డలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని ఆకాంక్షించారు. కానీ, ఇంగ్లిష్ మీడియం పేదల పిల్లలకు అందని ద్రాక్షలా మారింది. పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలంటే భారీగా అప్పులు చేయాల్సి వచ్చేది. సీఎం వైఎస్ జగన్ ఈ దుస్థితి నుంచి వారిని బయటపడేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేశారు.
నాణ్యమైన విద్యను హక్కుగా అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చి, విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయినా ఎక్కడైనా తెలుగు ప్రాభవం తగ్గిందా? ఇళ్లలో తెలుగులో మాట్లాడుకోవడం మానేశారా? ఎంత ఇంగ్లిష్ నేర్చుకున్నా మన తల్లిభాష ఎక్కడికిపోదు. ఇంగ్లిష్ మీడియాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మాఫియా అడ్డుకుంటోంది. అట్టడుగు, వెనుకబడిన వర్గాల వారు తమతో సమానంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని పెత్తందార్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.
సామాన్యులకు ఇంగ్లిష్ అందుబాటులోకి వస్తే పెత్తందార్లకు మాతృ భాషపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోంది. ఈ పెత్తందార్లందరూ కుటుంబ సభ్యులతో తెలుగులో తప్ప మిగిలిన అన్ని భాషల్లో మాట్లాడుకుంటారు. విద్యా రంగంలో సీఎం జగన్ సంస్కరణల కారణంగా మన విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రజెంటేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగారు’ అని చెప్పారు.
పోలవరం పాపాలు చంద్రబాబువే..
బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం చంద్రబాబు స్క్రిప్టునే వల్లెవేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. భూ దోపిడీలకు కేరాఫ్ అయిన చంద్రబాబును పక్కన పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై అవినీతి బురద జల్లడం సరికాదని హితవు పలికారు. 2014 ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చకపోగా.. మరోసారి ఏ ముఖం పెట్టుకుని జట్టు కట్టారని నిలదీశారు.
బాబు పాపాల వల్లే పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పోలవరాన్ని బాబు ఏటీఎంలా పిండేస్తున్నారని 2019లో ప్రధాని మోదీ యే చెప్పలేదా అని నిలదీశారు. ‘2017లో బాబు పోలవరం కాంట్రాక్టర్‌ను తప్పించి, రామోజీరావు వియ్యంకుడుకి చెందిన నవయుగకు కట్టబెట్టారు. 2013 – 14 రేట్లకు పనులు చేస్తామని కాంట్రాక్టర్ ఒప్పుకున్నా, ప్రజాధనం దోపిడీ లక్ష్యంగా చంద్రబాబు 2015–16 రేట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. మట్టి పనులే చేసి కోట్లు దోచేశారు. పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు. కాఫర్ డ్యాం సగం కట్టి వదిలేశారు.
దీంతో వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. పనులు జాప్యానికి ఇదే కారణం. దీనికి బాబే బాధ్యుడు. సీఎం జగన్ పోలవరంలో రూ.850 కోట్లు ఆదా చేశారు. స్పిల్‌వే పూర్తి చేశారు. డయా ఫ్రం వాల్ మరమ్మతులు చేస్తే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు. కేంద్రం నిధులు సరిగా ఇస్తే సీఎం జగన్ రెండేళ్లకంటే ముందే పూర్తి చేసి చూపిస్తారు. సీఎం జగన్ కేంద్రం నిధులు ఇచ్చే వరకు చూడకుండానే పోలవరం పనులు చేశారు.
ఇప్పటికీ కేంద్రం నుంచి రూ.2,700 కోట్లు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉంది. కూటమి కట్టడంతోనే రాష్ట్రానికి అన్యాయం మొదౖలెంది. ఈ ఏడాది మార్చి 7కి పోలవరం ఫేజ్–1 కింద మొత్తం రూ. 12,900 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించి నప్పటికీ, టీడీపీ–జనసేనతో బేజీపీ పొత్తు కుదరడంతో ఆ నిధులు ఆగిపోయాయి. షా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు.. విభజన చట్టంలోనే కేంద్రం పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. ఇదేమీ దానం, ధర్మం కాదు’ అని చెప్పారు.
లెక్కలు చూసుకోండి..
‘సీఎం జగన్ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ. 34 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను మార్చారు. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు. ప్రతి రూపాయికీ లెక్కలున్నాయి. అవినీతికి, వివక్షకు తావులేని పాలన చేస్తుంటే అవినీతి ముద్ర ఎలా వేస్తారు? ప్రభుత్వం చేసిన ప్రతి ఖర్చుకు లెక్కలన్నీ కేంద్రం వద్దే ఉంటాయి. అమిత్ షా వాటిని చూసి మాట్లాడాలి’ అని అన్నారు.
చంద్రబాబు, రామోజీ భూ దందా బయటపడుతుందనే!
‘ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించి, భద్రత చేకూర్చేందుకు కేంద్రమే ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారం అమిత్‌షాకు ఎందుకు కనిపించట్లేదు? చంద్రబాబు, రామోజీరావు భూదందాలు బయటపడతాయనే భయంతోనే వారిద్దరూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో బురద జల్లుతున్నారు.
గతంలోనే ఈనాడు అన్నదాతలో ఈ చట్టాన్ని గొప్పగా కీర్తించి (ఈనాడు ప్రసారం చేసిన వీడియోలను ప్రదర్శించారు), ఇప్పుడు భూములు దోచేస్తారంటూ ప్రచారం చేస్తోంది. ఇలా వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడం పెద్ద నేరం. రెండు నాల్కల ధోరణి బయటపడటంతో రామోజీరావు పాత వీడియో లింక్‌లను యూట్యూబ్ నుంచి తొలగించారు. భూముల అక్రమాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే రామోజీ వంటి నేరగాళ్లు ఎంతో మంది బయటకొస్తారు’ అని తెలిపారు.