భారత కంపెనీలతో యాపిల్‌ ఒప్పందం.. ఎందుకంటే.. | Murugappa Group And Titan Company In Talks For Local Assembly Of iPhone Camera - Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ కెమెరా తయారీకి భారత కంపెనీలతో ఒప్పందం..?

Published Tue, Apr 16 2024 11:53 AM

Murugappa Group And Titan Company For Local Assembly Of iPhone Camera Module - Sakshi

ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్‌ భారత్‌లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్‌ కెమెరా మాడ్యుల్స్‌ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్‌ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి.

ఐఫోన్‌ కెమెరా మాడ్యుల్స్‌ తయారీకి టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్‌తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్‌లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్‌ కెమెరాలను తయారుచేస్తోంది.

ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్‌నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది.

ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్‌లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్‌లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది.

యాపిల్‌ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్‌లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్‌లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్‌లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్‌పోర్ట్‌ల్లో భారత విమానాశ్రయం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది.

Advertisement
Advertisement