భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ కింగ్‌ ఇదే.. | Sakshi
Sakshi News home page

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ కింగ్‌ ఇదే..

Published Thu, Feb 8 2024 8:20 AM

Samsung Leads Smartphone Market In 2023 CMR - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత స్మార్ట్‌ఫోన్స్‌ విపణిలో శామ్‌సంగ్‌ హవా కొనసాగుతోంది. 2023లో 18 శాతం వాటాతో శామ్‌సంగ్‌ అగ్రస్థానంలో నిలిచినట్టు పరిశోధన కంపెనీ సైబర్‌మీడియా రిసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 

నివేదిక ప్రకారం.. గతేడాది 16 శాతం వాటాతో వివో రెండవ స్థానంలో, 13 శాతం వాటాతో వన్‌ప్లస్‌ మూడవ స్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే గతేడాది భారత స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్‌ 19 శాతం వృద్ధి చెందింది. 5జీ మోడళ్ల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ విక్రయాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023లో 122% వృద్ధి సాధించడం విశేషం.  

ఫీచర్‌ ఫోన్లకూ గిరాకీ.. 
రూ.7–25 వేల ధర శ్రేణిలో 5జీ మోడళ్ల వాటా 58 శాతంగా ఉంది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది 47 శాతం నమోదైంది. రూ.25,000లకుపైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్స్‌ విభాగం గతేడాది 71 శాతం ఎగబాకింది. రూ.50,000పైగా విలువైన సూపర్‌ ప్రీమియం మోడళ్ల విక్రయాలు 65 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే ఫీచర్‌ ఫోన్ల విభాగంలో అమ్మకాలు గతేడాది 52 శాతం అధికం అయ్యాయి. 4జీ ఫీచర్‌ ఫోన్లు ఈ దూకుడుకు కారణం అయ్యాయి. 2జీ ఫీచర్‌ ఫోన్స్‌ 12 శాతం క్షీణించాయి. రిలయన్స్‌ జియో 38 శాతం వాటాతో ఫీచర్‌ ఫోన్స్‌ విభాగంలో ముందు వరుసలో ఉంది. ఐటెల్‌ 23 శాతం, లావా 15 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

నాల్గవ త్రైమాసికంలో.. 
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ 29 శాతం దూసుకెళ్లింది. 19 శాతం వాటాతో షావొమీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్‌సంగ్‌ 18.9 శాతం, వివో 16, రియల్‌మీ 12, ఒప్పో 8, యాపిల్‌ 6 శాతం వాటా దక్కించుకున్నాయి. 2023 యాపిల్‌ అమ్మకాల్లో ఐఫోన్‌–15 సిరీస్‌ 50 శాతంపైగా వాటా చేజిక్కించుకుంది. ఇక 2024లో స్మార్ట్‌ఫోన్ల విపణి దేశవ్యాప్తంగా 7–8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. 5జీ మోడళ్ల అమ్మకాలు 40 శాతం పెరిగే ఆస్కారం ఉంది. 4జీ ఫీచర్‌ ఫోన్స్‌ 10 శాతం దూసుకెళ్లవచ్చు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement