Sakshi News home page

ఫ్యాన్‌.. ఫుల్‌ స్పీడ్‌

Published Sat, Apr 20 2024 3:45 AM

- - Sakshi

సభకు తరలి వచ్చిన ప్రజలకు

సీఎం జగన్‌ అభివాదం

జగన్‌ మామతోనే

నీకు బంగారు భవిష్యత్తురా కన్నా!

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. సార్వత్రిక ఎన్నికలకు పట్టుమని పాతిక రోజులు కూడా సమయం లేదు. ఒకవైపు నోటిఫికేషన్‌ వెలువడి మంచి రోజులు, ముహూర్తాలు చూసుకుని పార్టీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీ అధ్యక్షుడిగా సీఎం జగన్‌ అటు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఇటు తూర్పు గోదావరి, మరోవైపు కాకినాడ జిల్లాల్లో మండుటెండను సైతం లెక్క చేయకుండా.. పగలనక, రాత్రనక నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు దారి పొడవునా ప్రజాభిమానం ఉప్పొంగింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ సభల్లో భాగంగా.. ఉమ్మడి తూర్పు గోదావరిలో తొలి రోజైన గురువారం తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర సాగింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపాన రాత్రి బస చేసిన ఎస్‌టీ రాజాపురం నుంచి రెండో రోజైన శుక్రవారం ఉదయం 10.46 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమై కాకినాడ జిల్లా తునిలో రాత్రికి ముగిసి అనకాపల్లి జిల్లాకు వెళ్లింది. ఈ రెండు రోజుల యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో దారి పొడవునా ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ సీఎం జగన్‌పై గుండెల్లో దాచుకున్న ఈ ప్రాంత ప్రజల అభిమానం ఈ బస్సు యాత్రలో ఒక్కసారిగా పెల్లుబుకింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లో జగన్‌పై అభిమానం రెట్టింపైందే తప్ప ఎక్కడా చెక్కుచెదరలేదనే విషయం ఈ యాత్రలో అడుగడుగునా స్పష్టమైంది.

ప్రతిపక్ష నేతల చేరిక

● మొత్తంగా పార్టీ శ్రేణుల్లో ఈ యాత్ర మరింత జోష్‌ నింపింది. సీఎం జగన్‌కు లభిస్తున్న ఆదరాభిమానాలపై బలమైన నమ్మకం ఉండబట్టే ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న ప్రతిపక్ష నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్తేజాన్ని నింపింది.

● మొదటి రోజు తణుకు సమీపంలోని తేతలిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల టీడీపీ, జనసేన పార్టీల నేతలు బొంతు రాజేశ్వరరావు, నీతిపూడి గణేష్‌బాబు వైఎస్సార్‌ సీపీలో చేరారు.

● రెండో రోజు కాకినాడ జిల్లా నుంచి మాజీ మేయర్‌ పొలసపల్లి సరోజ చెరియన్‌, పెద్దాపురం టీడీపీ నుంచి తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్‌, జనసేన నుంచి గోపాల్‌, సినీ నటుడు గౌతమ్‌రాజు తదితరులు ఎస్‌టీ రాజాపురంలో వైఎస్సార్‌ సీపీకి జై కొట్టారు.

పార్టీ నేతలకు ఆత్మీయ పలకరింపు

బస్సు యాత్రకు బయలుదేరడానికి ముందు సీఎం జగన్‌ ఎస్‌టీ రాజాపురం వద్ద టెంటులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులను పేరుపేరునా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆ నాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుబ్బల తులసీకుమార్‌ తదితర నేతలతో జగన్‌ ముచ్చటించారు.

దారి పొడవునా జన సందోహం

● పార్టీ నేతలతో మాట్లాడిన అనంతరం ఎస్‌టీ రాజాపురం రాత్రి బస శిబిరం నుంచి ఉదయం 10.46 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది.

● ఎస్‌టీ రాజాపురం, వడిశలేరు, రంగంపేట, కోటపాడు, పెద్దాపురం బైపాస్‌, సామర్లకోట, అచ్చంపేట ఫ్లై ఓవర్‌, ఉండూరు క్రాస్‌ వరకూ ఏడీబీ రోడ్డులో దారి పొడవునా సీఎం జగన్‌కు అశేష జనసందోహం అఖండ స్వాగతం పలికింది.

● సూరంపాలెంలో ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు వినూత్న రీతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘అన్నా నువ్వు జాగ్రత్తగా వెళ్లి తిరిగి సీఎంగా తిరిగి రా’ ‘వైనాట్‌ 175’, ‘అన్నా మీరు జాగ్రత్త – మీ ఆరోగ్యం జాగ్రత్త’, ‘ఎన్ని యుగాలైనా చరిత్రలో నిలిచిపోతావన్నా’ అనే ప్లకార్డులతో స్వాగతం పలికారు. దీనికి పులకించిపోయిన ఆయన విద్యార్థులకు నవ్వుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సీఎం అభివాదంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు.

● పెద్దాపురం బైపాస్‌ పాండవుల మెట్ట క్రాస్‌ నుంచి సామర్లకోట జంక్షన్‌కు చేరుకునేసరికి బస్సుకు ఎదురెళ్లి అక్కడి పార్టీ కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబు, ఆయన భార్య చంద్రకళ, కుమార్తె సారిక హారతిచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. దొరబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సందోహం, పార్టీ శ్రేణులు, మహిళలు వెంట రాగా పలువురు తప్పెటగుళ్లు, తీన్‌మార్‌ వాయిద్యాలతో జనజాతరను తలపింపజేశారు. డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పులతో ఆ ప్రాంతం హోరెత్తి పోవడంతో తమ అభిమాన నాయకుడు వచ్చాడన్న ఆనందం అక్కడి వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.

బస్సు ఆపి పెద్దామెతో మాటామంతీ..

అచ్చంపేట ఫ్లై ఓవర్‌ క్రాస్‌ వద్ద వీకే రాయపురం గ్రామానికి చెందిన మోర్త కుమారి అనే పెద్దామె దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటో చేత్తో పట్టుకుని బస్సు వెనుక పరుగున వస్తున్న విషయాన్ని సీఎం జగన్‌ గమనించారు. వెంటనే బస్సును నిలిపి, కిందకు దిగారు. కుమారిని బస్సు వద్దకు పిలిచి మాట్లాడారు. దీంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. వైఎస్సార్‌ గతంలో సామర్లకోట వచ్చినప్పుడు తాను జున్ను తినిపించినప్పుడు తీసిన ఫొటోను ఆమె సీఎం జగన్‌కు చూపించింది. ‘నీకు ఏం కావాలమ్మా’ అని జగన్‌ అడగగా.. ‘నాకేమీ వద్దయ్యా.. మీరు మరోసారి సీఎం కావాలి’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. ఆ సమయంలో అక్కడున్న మహిళలు, యువత ఒక్కసారిగా కేరింతలు కొడుతూ జగన్‌ నినాదాలతో హోరెత్తించారు.

అభిమానుల సందడి

మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండూరు క్రాస్‌ రోడ్డులో మధ్యాహ్న భోజన విరామ శిబిరానికి సీఎం జగన్‌ చేరుకున్నారు. జనం మండే సూరీడును సైతం లెక్క చేయలేదు. ముఖ్యమంత్రిలో చెక్కుచెదరని చిరునవ్వుతో తన కోసమే వేచి చూస్తోన్న మహిళలు, అవ్వాతాతలు, చిన్నారులు, పార్టీ నేతలకు చేతులు పైకెత్తి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దారి పొడవునా తీన్‌మార్‌లు, డప్పుల సందడితో ఎక్కడ చూసినా అభిమానులు సందడి చేశారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపించింది. దారి పొడవునా మహిళలు బూడిద గుమ్మడి కాయలపై హారతి వెలిగించి దిష్టి తీసి.. ‘నువ్వు చల్లగా ఉండాలయ్యా’ అంటూ దీవించారు.

నదులన్నీ సముద్రం వైపు పరుగు తీసినట్టు.. జనమంతా జగన్‌ వెనుకే ఉరకలెత్తారు. తమ భవితను తీర్చిదిద్దే ప్రగతి విధాత ఆయనేనని మనసా వాచా కర్మణా నమ్ముతూ.. దిక్కులు పిక్కటిల్లేలా ‘జై జగన్‌’ అంటూ నినదించారు. వైఎస్సార్‌ సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. సీఎం జగన్‌ బస్సు యాత్ర వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. సార్వత్రిక సమరానికి సర్వసన్నద్ధుల్ని చేసింది.

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో సమరోత్సాహం జననేతపై చెక్కు చెదరని అభిమానం

రెట్టింపైన నమ్మకంతో పెరిగిన వలసలు టీడీపీ, జనసేనల నుంచి చేరికలతో నూతనోత్తేజం

12 నియోజకవర్గాల ప్రజలతో మమేకం ఏడీబీ రోడ్డులో దారి పొడవునా జనమే జనం

అడుగడుగునా.. అభిమాన తరంగమే..

కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర తిమ్మాపురం, చిత్రాడ, పిఠాపురం పాదగయ సెంటర్‌కు సాయంత్రం చేరింది. అక్కడ మధ్యాహ్నం నుంచీ ఎదురు చూస్తున్న అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మేళతాళాలతో యువకులు కదం తొక్కారు. ప్రియ నేతను కన్నులారా చూసిన సంతోషంతో ప్రజలు నృత్యాలతో ఆనందడోలికల్లో తేలియాడారు. వారికి సీఎం జగన్‌ బస్సు పై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పిఠాపురం బైపాస్‌ 216 జాతీయ రహదారిపై విరవాడ సెంటర్‌, రాయవరం సెంటర్‌, వై జంక్షన్‌ వద్ద జనాలు బారులు తీరి రోడ్లకు ఇరువైపులా నిలబడి పూలజల్లులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతిగా జగన్‌ ప్రజలకు అభివాదం చేశారు. గొల్లప్రోలు టోల్‌ ప్లాజా నుంచి ప్రత్తిపాడు రోడ్డు, గొల్లప్రోలు జంక్షన్‌, తాటిపర్తి రోడ్ల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ అభిమాన నేతకు సాదర స్వాగతం పలికారు. చేబ్రోలు బైపాస్‌లో తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ పట్టు రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. వారిని గమనించని సీఎం జగన్‌.. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత రైతులు తనకోసం వేచి ఉన్నారనే విషయం స్ఫురణకు తెచ్చుకున్నారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను పంపించి ఆ రైతులకు భరోసా కల్పించారు. ఆదర్శ కాలేజీ సెంటర్‌లో స్థానికులకు అభివాదం చేసి, దుర్గాడ సెంటర్‌ సత్తెమ్మ తల్లి ఆలయం మీదుగా కత్తిపూడి చేరుకున్నారు. బస్సు యాత్ర ఆలస్యమైనా ఆయన వచ్చే వరకూ దారి పొడవునా ప్రజలు తమ అభిమాన నేత కోసం వేచి చూస్తునే ఉన్నారు. రోడ్డు షోలో దారి పొడవునా అశేష జనవాహినిని ఆత్మీయంగా అభివాదం చేస్తూ కత్తిపూడి మీదుగా అన్నవరం, తలుపులమ్మ దేవస్థానం ముఖద్వారం మీదుగా తుని బైపాస్‌కు చేరుకున్నారు. అక్కడ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం ఒక్కసారిగా బాణసంచా కాలుస్తూ బ్రహ్మరథం పట్టారు. బస్సుపై జగన్‌తో పాటు మంత్రి, వైఎస్సార్‌ సీపీ తుని ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర తాండవ వంతెన మీదుగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోకి ప్రవేశించింది.

Advertisement
Advertisement