కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌పై నిర్మాతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. 2015లో 'ఉత్తమ విలన్' చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఉత్తమ విలన్ చిత్రానికి నిర్మాతలుగా కమల్ హాసన్, తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ అనే విషయం తెలిసిందే.
'ఉత్తమ విలన్' సినిమా తమను అప్పుల్లోకి నెట్టిందని తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ కోలీవుడ్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొద్దిరోజుల క్రితం ఆయన అన్నారు. ఉత్తమ విలన్ వల్ల భారీగా నష్టపోవడంతో తమతో రూ. 30 కోట్లతో ఒక సినిమా చేస్తానని కమల్ హాసన్ అప్పట్లోనే మాట ఇచ్చారని లింగుస్వామి పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా స్క్రిప్ట్ ను కమల్ చాలాసార్లు మార్చాడం వల్లే భారీగా నష్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కమల్ ఇచ్చిన మాట ప్రకారం తమతో ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదని వారు చెప్పారు. ఉత్తమ విలన్ భారీ నష్టాన్ని పూడ్చేందుకు మరో సినిమాను నిర్మిస్తానని కమల్ తమ సంస్థకు లిఖితపూర్వక హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నారు. ఇన్నేళ్లలో పలు కథలతో పాటు 'దృశ్యం' రీమేక్ చేద్దామని కమల్ వద్దకు వెళ్లినా కూడా సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడంలేదని లింగుస్వామి అంటున్నారు. దీంతో తప్పని పరిస్థితిలో కమల్ మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment