N. Lingusamy
-
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌పై నిర్మాతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. 2015లో 'ఉత్తమ విలన్' చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఉత్తమ విలన్ చిత్రానికి నిర్మాతలుగా కమల్ హాసన్, తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ అనే విషయం తెలిసిందే.'ఉత్తమ విలన్' సినిమా తమను అప్పుల్లోకి నెట్టిందని తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ కోలీవుడ్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొద్దిరోజుల క్రితం ఆయన అన్నారు. ఉత్తమ విలన్ వల్ల భారీగా నష్టపోవడంతో తమతో రూ. 30 కోట్లతో ఒక సినిమా చేస్తానని కమల్ హాసన్ అప్పట్లోనే మాట ఇచ్చారని లింగుస్వామి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ను కమల్ చాలాసార్లు మార్చాడం వల్లే భారీగా నష్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కమల్ ఇచ్చిన మాట ప్రకారం తమతో ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదని వారు చెప్పారు. ఉత్తమ విలన్ భారీ నష్టాన్ని పూడ్చేందుకు మరో సినిమాను నిర్మిస్తానని కమల్ తమ సంస్థకు లిఖితపూర్వక హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నారు. ఇన్నేళ్లలో పలు కథలతో పాటు 'దృశ్యం' రీమేక్ చేద్దామని కమల్ వద్దకు వెళ్లినా కూడా సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడంలేదని లింగుస్వామి అంటున్నారు. దీంతో తప్పని పరిస్థితిలో కమల్ మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. -
కమల్ సినిమా వల్ల భారీగా నష్టపోయాం.. ఆయన మాట ఇచ్చారు కానీ: లింగుస్వామి
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ 2015లో 'ఉత్తమ విలన్' చిత్రంలో నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఉత్తమ విలన్ చిత్రానికి నిర్మాతలుగా కమల్ హాసన్, దర్శకుడు లింగుస్వామి ఉన్నారు. ఈ సినిమా పరాజయం పట్ల లింగుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఉత్తమ విలన్ వల్ల భారీగా నష్టపోవడంతో తమతో రూ. 30 కోట్లతో ఒక సినిమా చేస్తానని కమల్ హాసన్ అప్పట్లోనే మాట ఇచ్చారని లింగుస్వామి పేర్కొన్నారు. ఉత్తమ విలన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో వారం వారం కథలో కమల్ మార్చేవారని ఆయన అన్నారు. గతంలో కూడా కమల్ ఇలాంటి ప్రయోగాలు చేసి భారీ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఈ సినిమా విషయంలో వర్కౌట్ కాలేదు. ఈ కారణంతో భారీగా ఖర్చు పెరిగిపోయింది. కొన్నేళ్ల క్రితం ఆయనతో 'దృశ్యం' సినిమా రీమేక్ చేయాలనుకుంటే అందుకు ఆయన అంగీకరించలేదు. కానీ అదే చిత్రాన్ని మరోకరు నిర్మించి విజయాన్ని అందుకున్నారుని లింగుస్వామి చెప్పుకొచ్చారు. ఉత్తమ విలన్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత కథలో పలు మార్పులు చేయాలని తాను సూచించినట్లు లింగుస్వామి తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం కొన్ని సీన్లు తొలిగించేందుకు మొదట అంగీకరించిన కమల్ ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయకుండానే విడుదల చేయాలని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తమ విలన్ వల్ల తాము లాభాలు చూశామని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తనకు చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థ తాజాగా ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. -
కోర్టులో ఫైన్ కట్టిన డైరెక్టర్ లింగుసామి
సినీ దర్శకుడు లింగుసామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న ఈయనపై పీవీపీ క్యాపిటల్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసులో స్థానిక సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తమ నుంచి దర్శకుడు లింగుసామి తీసుకున్న రూ.1.3 కోట్లు తిరిగి చెల్లించలేదని, ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని పిటిషన్లో పేర్కొంది. కేసును విచారించిన న్యాయస్థానం దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో రూ.10 వేలును లింగస్వామి కోర్టుకు అపరాధ రుసుం చెల్లించాడు. ఈ కేసు తిరుపతి బ్రదర్స్ సంస్థకు సంబంధించిందని, ఈ వ్యవహారంలో తాము చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: (షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే) -
షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'ది వారియర్' మూవీ డైరెక్టర్ లింగుస్వామికి కోర్టుషాక్ ఇచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంతలు హీరోహీరోయిన్లుగా సినిమాను ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ అనే ఓ సినిమాను తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ సినిమాస్ అనే కంపెనీ నుంచి రూ. 35లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న సొమ్మును చెక్ రూపంలో తిరిగి చెల్లించారు. కానీ ఆ చెక్‌బౌన్స్ అవ్వడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం డైరెక్టర్ లింగుస్వామి, అతని సోదరుడు చంద్రబోస్‌లకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో లింగుస్వామి పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. -
The Warrior Review: డాక్టర్ చేయలేని ఆపరేషన్ పోలీస్‌గా చేసిన 'ది వారియర్' రివ్యూ..
టైటిల్ 'ది వారియర్' నటీనటులు: రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతీశెట్టి, నదియా, అక్షరా గౌడ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్ లింగుస్వామి నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ విడుదల తేది: జులై 14, 2022 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆది పినిశెట్టి విలన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం 'ది వారియర్'. కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో గురువారం (జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా మొదటిసారిగా రామ్ పోతినేని తమిళ డైరెక్టర్‌తో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాల మధ్య రిలీజైన 'ది వారియర్' ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో రివ్యూలో చూద్దాం. కథ: సత్య (రామ్ పోతినేని) ఓ డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తయ్యాక హౌస్ సర్జన్‌గా వైద్య వృత్తిని ప్రారంభించేందుకు కర్నూలు వెళతాడు. ఒకరి ప్రాణం కాపాడితే తాను మళ్లీ జన్మించినట్లుగా భావించే వ్యక్తితం సత్యది. అలాంటి సత్య ఎదుటే గురు (ఆది పినిశెట్టి) మనుషులు తను కాపాడిన వారి ప్రాణం తీయడాన్ని తట్టుకోలేకపోతాడు. పోలీస్‌లకు కంప్లైంట్ చేసిన లాభం ఉండదు. ఇలాంటి సంఘటనలే ఎదురై గురు చేతిలో సత్య చావు దెబ్బలు తింటాడు. గురు నుంచి తప్పించుకున్న సత్య రెండేళ్ల తర్వాత కర్నూల్‌కు డీఎస్పీగా వస్తాడు. ఆ తర్వాత సత్య ఏం చేశాడు ? గురును ఎలా ఎదుర్కొన్నాడు ? పోలీసులను ఎలా మార్చాడు ? డాక్టర్‌గా చేయలేని ఆపరేషన్ పోలీస్‌గా ఎలా చేశాడు ? అనే తదితర విషయాలు తెలియాలంటే 'ది వారియర్' చూడాల్సిందే. విశ్లేషణ: పోలీస్ తరహా సినిమాలు ఇదివరకు చాలానే వచ్చి మెప్పించాయి. కానీ ఒక డాక్టర్.. పోలీస్‌గా మారి రౌడీయిజాన్ని రూపు మాపడం అనే కొత్త కథతో 'ది వారియర్'ను తెరకెక్కించారు దర్శకుడు ఎన్ లింగుస్వామి. డాక్టర్‌గా సత్య ఎదుర్కున్న పరిస్థితులను, అక్కడి పోలీసు వ్యవస్థ తీరును, గురు విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సినిమాలో విజిల్ మహాలక్ష్మి (కృతీశెట్టి), సత్య మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే సినిమా మొత్తం ఊహించిన విధంగా, రొటీన్‌గా సాగుతుంది. దీంతో కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. చెప్పుకోదగ్గ డైలాగ్‌లు సినిమాకు పడలేదు. అయితే సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న బీజీఎం, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే: రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాక్టర్‌గా, పోలీస్‌గా, లవర్‌గా రామ్ అదరగొట్టేశాడు. డ్యాన్స్ మూమెంట్స్, యాక్షన్ సీన్లలో చాలా బాగా చేశాడు. పోలీస్ లుక్‌లో సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక విలన్‌గా ఆది పినిశెట్టి యాక్టింగ్ ఇరగదీశాడు. రామ్, ఆది పినిశెట్టి పోటాపోటీగా నటించి అబ్బురపరిచారు. మాస్ లుక్‌లో మాస్ పెర్ఫామెన్స్‌తో ఆది చక్కగా నటించాడు. ఆర్జే విజిల్ మహాలక్షిగా కృతీశెట్టి అందంగా నటించింది. సినిమాలో ఆమె ప్రజెన్స్ హాయినిస్తుంది. సత్య తల్లిగా నదియా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చెడ్డవారిని శిక్షించాలని కొడుక్కి చెప్పే తల్లి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. విలన్ గురు పాత్రకు వచ్చే బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథ కొత్తగా ఉన్నా కథనం రొటీన్‌గా ఉన్న 'ది వారియర్'. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
విజిల్ వేయించేలా 'ది వారియర్' విజిల్ సాంగ్..
Ram Pothineni The Warrior Whistle Lyrical Song Released By Surya: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను బయటకు వదిలింది చిత్రబృందం. ఈ సినిమాలోని 'విజిల్.. విజిల్..' అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్‌తో అందరి చేత విజిల్ వేయించేలా మ్యూజిక్ అందించాడు. సాహితీ రాసిన క్యాచీ లిరిక్స్, సింగర్స్ ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ అద్భుతంగా ఆలపించారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, కృతిశెట్టి వేసిన స్టెప్స్ పాటకు హైలెట్‌గా నిలవనున్నాయి. విడుదలైన అతి కొద్ది సమయంలోనే ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. Here’s the #WhistleSong from #TheWarriorrhttps://t.co/4v4ED7InOz All the best for a super success!! @dirlingusamy @ThisIsDSP @RamSayz @AadhiOfficial @IamKrithiShetty — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2022 -
రెహ్మాన్ జయంతి: కవితల పోటీలు నిర్వహించిన లింగుస్వామి
దివంగత ప్రఖ్యాత కవి అబ్దుల్ రెహ్మాన్ తనకు గురువులాంటి వారని దర్శకుడు లింగుస్వామి అన్నారు. రెహ్మాన్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునే విధంగా లింగుస్వామి కవితల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ.25 వేలు, ద్వితీయ బహుమతికి రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.10 వేలుతో పాటు మరో 50 మందికి తలా వెయ్యి రూపాయలు నగదును అందించారు. హైకూ కవిదై- 2022 పేరుతో స్థానిక కస్తూరి రంగన్ రోడ్డులోని రష్యా కల్చరల్ హాలులో జరిగిన ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించి (53 మంది రాసిన కవితలతో ముద్రించిన) హైకూ కవిదై - 2022 బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం లింగుస్వామి మాట్లాడుతూ ఇకపై ఏటా ఆయన పేరుతో కవితల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. చదవండి: నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్ ‘చింగారీ’ సాంగ్ ఫేం వలూశా డిసూజా గురించి ఈ విషయాలు తెలుసా? -
సినిమా రివ్యూ: సికిందర్
నటీనటులు: సూర్య, సమంత, మనోజ్ బాజ్ పాయ్, విద్యుత్ జమ్వాల్, దిలీప్ తాహిల్, రాజ్ పాల్ యాదవ్ ఫోటోగ్రఫి: సంతోష్ శివన్ సంగీతం: యువన్ శంకర్ రాజా ఎడిటింగ్: ఆంథోని నిర్మాత: లగడపాటి శ్రీధర్, సుభాష్ చంద్రబోస్, సిద్దార్థ్ రాయ్ కపూర్ దర్శకత్వం: లింగుస్వామి రాజు భాయ్ (సూర్య) ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ (సూర్య) వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు (విద్యుత్ జమ్వాల్) ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స్నేహితుడు చందును ముంబైని శాసించే ఇమ్రాన్ భాయ్ (మనోజ్ బాజ్ పాయ్) చంపేస్తాడు. తన గ్రూప్ లో కొందరు చేసిన నమ్మక ద్రోహా వల్లే చందు మరణానికి కారణమని రాజుభాయ్ తెలుసుకుంటాడు. అయితే రాజుభాయ్ ని కూడా ఇమ్రాన్ గ్రూప్ కాల్చేస్తుంది. ఇమ్రాన్ గ్రూప్ జరిపిన కాల్పుల్లో గాయపడిన రాజుభాయ్ ఏమయ్యాడు? రాజుభాయ్ ను కృష్ణ కలిశాడా? రాజుభాయ్, కృష్ణను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఇమ్రాన్ భాయ్ మాఫియా సామ్రాజ్యానికి ఎవరు చెక్ పెట్టారు? తన స్నేహితుడు చందు మరణానికి రాజుభాయ్ ప్రతీకారం తీర్చుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'సికిందర్' చిత్ర కథ. నటీనటుల, సాంకేతిక వర్గాల పనితీరు: ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న సూర్య ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ పాత్రలను సూర్య సమర్ధవంతంగా పోషించాడు. రెండు పాత్రల్లోనూ తన మార్కును ప్రదర్శించాడు. గత చిత్రాల్లోని పాత్రలను పోల్చుకుంటే రాజుభాయ్, కృష్ణ పాత్రలు సూర్య కెరీర్ లోనే సాదా సీదా పాత్రలని చెప్పవచ్చు. సూర్య ప్రేయసిగా సమంత నటించింది. ఈ చిత్రంలో సమంత పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కాని.. ఓ అడుగు ముందుకేసి.. పరిమితుల్లేకుండా గ్లామర్ ను ప్రదర్శించింది. సమంత కొన్ని సన్నివేశాల్లో హాట్ హాట్ గా కనిపించింది. విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్ పాయ్, బ్రహ్మనందం పాత్రలు అంతంత మాత్రమే. సంతోష్ శివన్ ఫోట్రోగ్రఫి, యువన్ శంకర్ రాజా సంగీతం, ఆంథోని ఎడిటింగ్ పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. సమీక్ష: సూర్య గత చిత్రాలకు కథ, కథనాలే ప్రధానం. అయితే సికిందర్ చిత్ర కథ, కథనాలు గతంలోని సూర్య సినిమాలకు విభిన్నంగా కనిపిస్తుంది. సికిందర్ చిత్రంలో ఎలాంటి కొత్తదనం కనిపించకపోగా... కథనంలో దమ్ములేకపోవడం ప్రేక్షకుల్ని అసహనానికి గురిచేస్తుంది. ఇక రెండవ భాగంలో ఈ సాగతీత ఎక్కువగానే అనిపించింది. సుమారు మూడు గంటల సినిమాలో ఎక్కడా ప్రేక్షకుడు ఫీలయ్యే సన్నివేశాలు, వినోద సన్నివేశాలూ ఎక్కడా కనిపించవు. ఏదో సినిమా నడుస్తుందనే ధోరణి కనిపిస్తుంటుంది. కథ బలహీనంగా ఉండటమనే అంశం మిగితా విభాగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించింది. ఓవరాల్ గా సూర్యను సికిందర్ గా చూపించాలని దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకులు ఆదరించడంపైనే సికిందర్ విజయం ఆధారపడి ఉంటుంది. పేలవమైన కథ, కథనాలు సూర్యను సికిందర్ గా నిలబెట్టడం అనేది కష్టమైనదే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల -
'గోలి సోడా'ను ఇష్టపడిన రజనీ
విమర్శకుల, ప్రేక్షకులను ఆకర్సించిన తమిళ చిత్రం 'గోలి సోడా'పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న పిల్లలతో రూపొందించిన 'గోలి సోడా' చిత్రం అద్బుతంగా ఉంది అని రజనీ వ్యాఖ్యానించారు. చెన్నైలోని కోయోంబెదు మార్కెట్ కు చెందిన నలుగురు పిల్లల కథను నేపథ్యంగా ఎస్ డీ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కోయెంబెడు మార్కెట్ లాంటి ప్రాంతంలో పిల్లలతో నిర్మించిన చిత్రం అద్బుతంగా ఉంది. నలుగురు బాల నటులు బాగా నటించారు. ఓ మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేక పోయాను అని రజనీ తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని ఆశ్వీరదించాను అని ఓ ప్రకటనలో తెలిపారు. 'గోలి సోడా' చిత్రానికి రజనీ ప్రశంసలు లభించడంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన లింగుస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని చూసి అభినందించడం మాకు గర్వంగా ఉంది. ఈ చిత్రం గురించి మాతో ఓ గంట పాటు ఫోన్ లో రజనీ మాట్లాడారు అని లింగుస్వామి తెలిపారు. జనవరి 24 తేదిన విడుదలైన 'గోలి సోడా' ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి వారంలో 8 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం గమనార్హం.