'గోలి సోడా'ను ఇష్టపడిన రజనీ
విమర్శకుల, ప్రేక్షకులను ఆకర్సించిన తమిళ చిత్రం 'గోలి సోడా'పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న పిల్లలతో రూపొందించిన 'గోలి సోడా' చిత్రం అద్బుతంగా ఉంది అని రజనీ వ్యాఖ్యానించారు. చెన్నైలోని కోయోంబెదు మార్కెట్ కు చెందిన నలుగురు పిల్లల కథను నేపథ్యంగా ఎస్ డీ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
కోయెంబెడు మార్కెట్ లాంటి ప్రాంతంలో పిల్లలతో నిర్మించిన చిత్రం అద్బుతంగా ఉంది. నలుగురు బాల నటులు బాగా నటించారు. ఓ మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేక పోయాను అని రజనీ తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని ఆశ్వీరదించాను అని ఓ ప్రకటనలో తెలిపారు.
'గోలి సోడా' చిత్రానికి రజనీ ప్రశంసలు లభించడంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన లింగుస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని చూసి అభినందించడం మాకు గర్వంగా ఉంది. ఈ చిత్రం గురించి మాతో ఓ గంట పాటు ఫోన్ లో రజనీ మాట్లాడారు అని లింగుస్వామి తెలిపారు. జనవరి 24 తేదిన విడుదలైన 'గోలి సోడా' ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి వారంలో 8 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం గమనార్హం.