ప్ర‘పంచాంగం’ | Sakshi
Sakshi News home page

ప్ర‘పంచాంగం’

Published Mon, Apr 8 2024 12:18 AM

Sakshi Editorial On Astronomers And Panchangam

విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పదునెక్కినకొద్దీ అతణ్ణి అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. మనుగడ పూర్తిగానూ, నేరుగానూ ప్రకృతివనరులపై ఆధారపడిన ఆదిమకాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది, కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు; కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కుప్రశ్న. 

ఈ ఋతుపరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి; తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై, కొత్తవి అడుగుపెడుతున్నాయి! దీనిని అర్థంచేసుకోడానికీ, దీనికి ఎవరు కారణమో తెలుసుకోడానికీ సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణమనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాలగణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొన సాగుతోంది. ఆ క్రమంలోనే రేపు, అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకొంటున్నది స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఉగాది. 

ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం; గడిచిన ఏడాది ఎదురైన కష్టనష్టాలూ, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలూ, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భమను కుంటాం; ఆరు రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం; పంచాంగ శ్రవణానికీ, కవితా శ్రవణానికీ కూడా చెవులు అప్పగిస్తాం. నూతనశోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే.

అయితే, ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది; అంతుబట్టని కాలచక్రపు తిప్పుళ్ళకు బిత్తరపోయి, తిరిగి నిలదొక్కుకోడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది; కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది; మనం అనాగరికునిగా పొరబడే ఆదిమానవుణ్ణే తొలి  ఖగోళ వేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగిచూసినప్పుడు నాటి మానవుల ఆరాటపోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్లను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. 

చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం, యాభైవేల సంవత్సరాల క్రితమే పాతరాతియుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. అప్పటి గుహాచిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ పన్నెండు రాశులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతు వుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతరకాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు.

చంద్రునితో ఋతువుల మార్పును ముడి పెట్టి చాంద్రమానానికి అలా తెరదీయడం గొప్ప ముందడుగే కానీ; ఋతుచక్రానికి, చాంద్రమానంలోని మాసచక్రానికి పొంతన కుదరకపోవడంతో, ఋతుపరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ; ఇరవైమూడున్నర డిగ్రీల ఒంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్స రానికి 300 నుంచి 400 రోజులను లెక్కగట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే, మరింత నిర్దుష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది.

రెంటిమధ్యా ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి రెండు మానాలనూ సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయింది. రోమన్, జూలి యన్, గ్రెగేరియన్‌ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని ‘కేలండర్‌ కథ’ అనే పుస్తకంలో డా. మహీధర నళినీమోహన్‌ అంటారు. మనదేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళపండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు.

చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్కా అలాంటిదే. భూభ్రమణంలో ఒంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతుపరివర్తనే అంతరించి మరింత విషమసమస్య తలెత్తే మాటా నిజమే. మొత్తంమీద అప్పటినుంచీ ఇప్పటివరకూ కేవల చాంద్రమానం, కేవల సౌరమానం; చాంద్ర– సౌరమానాల సమన్వయం అనే మూడు పద్ధతులూ అమలులో ఉన్నాయి. విశేషమేమిటంటే, కాల గణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ, ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య, వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక ‘పంచాంగం’ అనే మాటను ‘ప్రపంచాంగం’గానూ చెప్పుకోవడంలో తప్పులేదు. 

పైన చెప్పిన సౌర, చాంద్రమానాల సమన్వయాన్నే ‘యుగం’ అంటారని ‘జనకథ’ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. అధికమాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా రెండు మానాల సమన్వయం అయిదేళ్ళకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన ‘యుగాది’. ఇప్పుడు ‘ఉగాది’ పేరుతో ఏటా జరుపుకొంటున్నాం.   

Advertisement

తప్పక చదవండి

Advertisement